కోమటిరెడ్డి నయా ట్విస్ట్ తో….?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత దూకుడుగానే ఉంటారు. అయితే ఆయన దూకుడుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లెం వేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలను సాకుగా చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ లపై అనర్హత వేటు వేశారు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు వీరిద్దిరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటి వరకూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం పునరుద్ధరించడంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో స్పీకర్ ను కూడా కాంగ్రెస్ నేతలు కలసి ఇద్దరి శాసనసభ్యుల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ప్రభుత్వం స్పందించక పోవడంతో….

కాని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేతలపై వత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ శాసనసభ్యులందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలన్నది కోమటిరెడ్డి డిమాండ్. ఇప్పటికే పలు సమావేశాల్లో తన అభిప్రాయాన్ని నేతల ముందుంచారు. కాని సీనియర్ నేతలెవ్వరూ కోమటిరెడ్డి ప్రతిపాదనను అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో శాసనసభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్పవచ్చన్నది కోమటిరెడ్డి వ్యూహం.

సీనియర్ నేతలు విముఖత…..

అయితే సీనియర్ నేతలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ముఖ్యంగా శాసనసభ పక్షనేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి ప్రతిపాదనను కొట్టిపారేస్తున్నారని సమాచారం. అయినా కోమటిరెడ్డి వత్తిడి పెంచుతున్నారు. ఈవిషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి భావిస్తున్నారు. కోమటిరెడ్డి ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి కూడా వంత పాడుతున్నారని చెబుతున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే పార్టీకి హైప్ పెరగడమే కాకుండా ఎన్నికల సమయంలో ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎండగట్ట వచ్చన్నది వారి వ్యూహం.

ఎమ్మెల్యేలతో చర్చించకుండా…..

కాని శాసనసభ్యులు మాత్రం హైకమాండ్ తో చర్చించకుండా రాజీనామాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. హైకమాండ్ ఎదుట ఈ ప్రతిపాదనను ఉంచుతామని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డికి కొందరు సర్దిచెబుతున్నారు. ఇప్పటికే నాగం జనార్థన్ రెడ్డి చేరికతో మహబూబ్ నగర్ జిల్లాలో తలనొప్పులు ప్రారంభమయ్యాయి. డీకే అరుణ కాంగ్రెస్ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేయాలంటే అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలను రకరకాల ట్విస్ట్ లతో కంగారు పెడుతున్నారన్నది గాంధీభవన్ వర్గాల టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*