కొణతాల క్రాస్ రోడ్స్ లో…..?

సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయ‌న వ్యూహ‌మేంటి? అనే చ‌ర్చ త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజ‌కీయాలు చేసిన కొణతాల‌.. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి పార్లమెంటు స్థానం నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన కొణతాల వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్నారు. 1989, 1991లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఆయ‌న గెలుపొందారు. సాత్వికుడిగా, విశ్వసనీయవ్యక్తిగా గుర్తింపు పొందిన కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేత కావడం గమనార్హం. గవర సామాజిక వర్గంలో కులం కట్టుబాట్లు గట్టిగా పాటిస్తారు.

వైసీపీలో చేరి…..

2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం… వైఎస్ కేబినెట్‌లో ఆయ‌న మంత్రి అవ్వడం కూడా జ‌రిగాయి. అయితే 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాస‌రావు చేతిలో ఓడిపోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయంగా పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. ఆ త‌ర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగ‌ళి అక్కడే అన్న చందంగా ఆగిపోయింది. ఇక‌, వైఎస్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న కొణ‌తాల త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైఎస్ త‌న‌యు డు జ‌గ‌న్ పార్టీ వైసీపీలో చేరారు. అయితే, పార్టీలో త‌న‌కు, త‌న మాట‌కు ఎవ‌రూ విలువ ఇవ్వడం లేద‌ని ఆరోపిస్తూ.. 2016లోనే ఆయ‌న వైసీపీకి రాంరాం చెప్పారు. చివ‌ర‌కు జ‌గ‌న్ కొణ‌తాల‌కు 2014లో ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు.

వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత…..

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పటి నుంచి స్వతంత్రంగానే ఉంటున్న కొణతాల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా మీడియా దృష్టి కి వ‌స్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌నే సొంత‌గా పార్టీ పెట్టుకుంటార‌ని కొన్నాళ్లుగా వార్తలు వ‌చ్చాయి. అయితే, విభేదాలు మ‌రిచిపోయి.. వైసీపీలోకి చేర‌తార‌ని, దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ కీల‌క నాయ‌కులు ఆయ‌నతో రాయ‌బారం కూడా న‌డిపార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చలు న‌డిచాయి. అయితే, ఇవేవీ సాధ్యం కాలేదు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగ‌డ‌కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ముద్రగడకు మద్దతుగా…..

కాపు ఉద్యమానికి కూడా మ‌ద్దతిచ్చారు. త‌మ సామాజిక వ‌ర్గంతో సంబంధం లేని కాపుల‌కు మ‌ద్దతిచ్చారు కాబ‌ట్టి ఈయ‌న ముద్రగ‌డ‌తో క‌లిసి పార్టీని ఏర్పాటు చేస్తున్నార‌న్న ప్రచారం జ‌రిగింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కొన్నాళ్ల కింద‌ట చంద్రబాబు నిర్వహించిన ప్రత్యేక పోరాట ఉద్యమం.. ధ‌ర్మ పోరాట దీక్షకు కొణతాల మ‌ద్దతు ప‌లికారు. చంద్రబాబును కొనియాడారు కూడా. దీంతో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. విశాఖ రైల్వే జోన్ కోసం కూడా కొణ‌తాల స్వయంగా పోరు ప్రారంభించారు. మౌన దీక్షలు కూడా చేశారు.

ప్రజలకు దగ్గరగా…..

నేటికీ ప్రజా పోరాట‌ల‌తోనూ ప్రజ‌ల‌తోనూ దూరంగా ఉండ‌కుండా.. త‌నదైన పంథాలో ముందుకు సాగుతున్నారు కొణతాల. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఏ పార్టీలోకి చేర‌తారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వైసీపీకిలోకి వెళ్లే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఇక‌, కాంగ్రెస్ మ‌ళ్లీ పాత‌కాపుల‌కు పెద్దపీట వేస్తున్న నేప‌థ్యంలో తిరిగి ఆయ‌న అందులోకి వెళ్తారా? అనేది కూడా సందేహంగానే ఉంది. ఒక వేళ టీడీపీలోకి వెళ్లినా అక్కడ సీటు హామీ వస్తేనే ఆయ‌న ఆ పార్టీలో చేరే అంశం గురించి ఆలోచ‌న చేసే ఛాన్స్ ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.