కొండా కల నెరవేరేనా..?

వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం కోసం వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కీలక నేతలు కొండా సురేఖ, మురళీధర్ రావు దంపతులు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా, మురళీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక వీరి కూతురు సుశ్మితా పటేల్ ను సైతం ఈసారి ఎన్నికలబరిలో నిలిపి ఎమ్మెల్యేగా చూసుకోవాలని ఈ కుటుంబం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆమె వంచనగిరి పీఏసీఎస్ ఛైర్పర్సన్ గా ఉన్నారు. ఇందుకోసం భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొండా దంపతులు గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె నేరుగా భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని బాహాటంగానే ప్రకటించారు.

పక్కా స్కెచ్ తోనే…

కొండా దంపతులకు మొదటినుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో కాస్త పట్టుంది. దీనికి తోడు మధుసూదనాచారి ఈసారి బరిలో ఉండరనే ప్రచారం నేపథ్యంలో తమ కూతురుని పోటీ చేయించేందుకు భూపాలపల్లి తమకు అనువైన నియోజకవర్గంగా ఎంచుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. ప్రతీ గ్రామం నుంచి ఇరవై మంది చొప్పున తన వర్గం వారి జాబితాను కూడా తయారు చేసుకున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఎవరు ఏ కార్యానికి పిలిచినా దంపతుల్లో ఎవరో ఒకరు హాజరవుతున్నారు. దీనికి తోడు ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వారు నిర్మించిన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా భూపాలపల్లి నుంచి పెద్ద ఎత్తున అనుచరులను రప్పించి కూతురు సుశ్మితా పటేల్ ను వారికి పరిచయం చేశారు.

స్పీకర్ పైన వ్యతిరేకత నిజమేనా..?

భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. దీంతో ఆయన ఎక్కువగా హైదరాబాద్ కు లేదా రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో ఆయన ముగ్గురు కుమారులే తలా రెండు మండలాలను పంచుకుని అనధికార ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. దీనికి తోడు స్వంత పార్టీ ద్వితీయ శ్రేణీ క్యాడర్ కూడా వీరిపై కొంత అసంతృప్తితో ఉందని వినిపిస్తోంది. వ్యక్తిగతంగా స్పీకర్ పై వ్యతిరేకత లేకున్నా, ఇతర అంశాల్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు.

ఇది మూడో వర్గమే..

భూపాలపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ వర్గాలు పెరుగుతున్నాయి. సంవత్సరం కింది వరకు  మధుసూదనాచారికే అనుకూలంగా ఉన్నట్లు కన్పించింది. కాగా  ఇటీవల గండ్ర సత్యనారాయణరావు టీఆర్ఎస్ లో చేరారు. ఆయన గత ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి 57 వేలకు పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కూడా  టీఆర్ఎస్ టీక్కెట్ తనకే అన్న ధీమాతో ఉన్నారు. ఇక ప్రస్థుతం కొండా వర్గం కూడా చురుగ్గా తయారవడంతో మొత్తంగా నియోజకవర్గం టీఆర్ఎస్ లో మూడు వర్గాలయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కూతురుని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్న కొండా దంపతుల కల ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*