కొండా దంప‌తుల క‌న్‌ఫ్యూజ్ పాలిటిక్స్‌

తాము టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతామ‌నీ, తాము ఇక్క‌డ సంతోషంగానే ఉన్నామ‌నీ, కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌నీ కొండా దంప‌తులు చెబుతున్నారు. పార్టీ మారుతున్నార‌నే వార్త‌ల్ని ఖండిస్తున్నారు. ఇలా అనేక‌సార్లు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి చెప్పినా పార్టీ మారుతున్నార‌నే ఊహాగానాల‌కు మాత్రం తెర‌ప‌డ‌డం లేదు. ఏదో ఒక‌ర‌కంగా కొండా దంప‌తుల పార్టీ మార్పుపై ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అస‌లు వీరి విష‌యంలో ఎందుకింత గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ద‌న్న‌దే అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. వారు టీఆర్ఎస్‌లోనే ఉంటారా..? నిజంగానే ఎవ‌రైనా కావాల‌ని ప్ర‌చారం చేస్తున్నారా..? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

వ్యక్తిగత ప్రతిష్టతోనే…..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొండా దంప‌తుల రాజ‌కీయ నేప‌థ్యం, ప్ర‌జ‌ల్లో వారికి ఉన్న‌ప‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కొండా సురేఖ ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసినా.. ఎక్కువ‌గా వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌త‌తోనే గెలుస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఆమె భ‌ర్త కొండా ముర‌ళి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా వీరి కూతురు సుస్మితాప‌టేల్ కూడా వ‌చ్చేఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె ప్ర‌స్తుతం వంచ‌న‌గిరి పీఏసీఎస్ చైర్మ‌న్‌గా ఉన్నారు. కూతురు టికెట్ కోసం కొండా దంప‌తులు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్న చేస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈసారి త‌న‌తోపాటు త‌న కూతురుకూ టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో వారు కొండా సురేఖ ఉన్నారు.

కూతురు టిక్కెట్ విషయంలోనే…..

కొండా దంప‌తులు టీఆర్ఎస్ వీడుతున్నార‌నీ, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నార‌నే ప్ర‌చారం ఆగ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వారి కూతురు టికెట్ విష‌య‌మేన‌ని ప‌లువురు నాయకులు భావిస్తున్నారు. అయితే తాము టీఆర్ఎస్‌లో ఉంటామ‌ని చెబుతున్న కొండా దంప‌త‌లు అదే స‌మ‌యంలో త‌మ కూతురు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి నుంచి పోటీ చేస్తుంద‌ని అంటున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల ఎమ్మెల్యే సురేఖ క్యాంపు కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి కూడా ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వేలాదిమంది కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా సుస్మితాప‌టేల్ మాట్లాడుతూ తాను భూపాల‌ప‌ల్లి నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా కార్య‌క‌ర్తలు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది.

రెండు టిక్కెట్లు ఇస్తే…..

భూపాల‌ప‌ల్లి నుంచి స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక ప‌రకాల నుంచి చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రికీ టికెట్లు దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. వీరిని కాద‌నీ కొండా దంప‌తుల కూతురు సుస్మితా ప‌టేల్ టికెట్ ఇవ్వ‌డం అసాధ్య‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూపాప‌ల్లి నుంచి పోటీ చేస్తాన‌ని సుష్మితాప‌టేల్ అక్క‌డ‌క్క‌డ స‌మావేశాల్లో అన‌డం వ‌ల్ల‌నే కొండా దంప‌తులు పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారానికి తెర‌ప‌డ‌డం లేద‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. మ‌రో వైపు రెండు టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి వ‌స్తామ‌న్న సంకేతాలు కూడా కొండా దంప‌తులు వ‌దులుతున్నార‌ట‌. ఇదంతా అధికార పార్టీ అధిష్టానాన్ని బెదిరించే ప్ర‌య‌త్నం అని కూడా టాక్ వినిపిస్తోంది. కొండా దంప‌తుల వ్య‌వ‌హార శైలే ఈ ప్ర‌చారానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*