
ఎలాగైనా తమ కూతురు సుస్మితను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు కొండా దంపతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత యేడాది కాలంగా ఇందుకోసం ఎన్నెన్నో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే కొండా దంపతులు నయా ప్లాన్ వేశారా..? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ, ఎమ్మెల్సీగా కొండా మురళి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కూతురు సుస్మితను భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతామని ఇప్పటికే వారు పలుమార్లు ప్రకటించారు. ఏకంగా ఇటీవల ఫేస్బుక్లో ఆన్లైన్ సర్వే కూడా చేయించారు. అయితే ఇందులో ఆమెకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి చిట్టెక్క(సుస్మిత ముద్దుపేరు)ను పోటీ చేయించాలని, లేదా వరంగల్ తూర్పు నుంచి బరిలోకి దించాలని ఎక్కువమంది తమ అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది.
టీఆర్ఎస్ లో చేరాక……
నిజానికి కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులు తిరుగులేని నేతలుగా ఎదిగారు.. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా కొండా సురేఖ వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే వైఎస్సార్ మరణాంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు జగన్‌తో కలిసినడిచారు. జగన్ కోసం సురేఖ తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నుంచి బరిలోకి దిగిన కొండా సురేఖ తరుపున ఆమె కూతురు సుస్మిత కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆమె ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మంచి పట్టున్న…..
ప్రస్తుతం సుస్మిత తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పలు సేవా కార్యక్రమాలతో అటు భూపాలపల్లి, ఇటు వరంగల్ తూర్పు ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కొండా దంపతులకు భూపాలపల్లి నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇప్పటికే సమయం దొరికినప్పుడల్లా ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తమ క్యాడర్‌ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల భూపాలపల్లిలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నిరేపాయి. నియోజకవర్గంలో స్పీకర్‌కు పెద్దగా పట్టులేదనీ, ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ, పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో తమ కూతురిని పోటీ చేయిస్తామని ఆమె ప్రకటించారు. ఈ వివాదం సీఎం కేసీఆర్ దాకా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
అలెర్ట్ అయిన స్పీకర్…..
కొండా దంపతులు తన నియోజకవర్గంలో పట్టుకోసం చేస్తోన్న ప్రయత్నాలతో స్పీకర్ అలెర్ట్ అయ్యారు. ఆయన నియోజకవర్గంలో పల్లెప్రగతి నిద్ర పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖను ఒంటరిని చేయడానికి నగర్ మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సారయ్యతోపాటు ప్రదీప్‌రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ తనతోపాటు తన కూతురుకు టికెట్లు ఇవ్వకపోతే.. కొండా దంపతులు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పీటముడిని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా విప్పుతారో చూద్దాం.
Leave a Reply