పొగ పెడితే…పోకుండా ఉంటారా?

కొండా సురేఖ ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ లో వైఎస్ అనుచరులుగా పనిచేసి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరుకున్న కొండా దంపతులు గత కొంత కాలంగా అసహనంగానే ఉన్నారు. వరంగల్ జిల్లాలో తమకు పట్టున్న ప్రాంతాల్లో గులాబీ నేతలు వేలు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు విడుదల చేసిన తొలి జాబితాలో స్థానం దక్కకపోవడం కూడా వారిని కలిచి వేసింది. దీంతో వారు పార్టీని వీడేందుకు దాదాపు సిద్ధమయ్యారు.

ఎర్రబెల్లి వర్సెస్ కొండా ఫ్యామిలీ…..

వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు, కొండా ఫ్యామిలీకి సుదీర్ఘకాలం నుంచి వైరం ఉంది. ఇద్దరూ చెరో పార్టీలో ఉంటూ జిల్లాలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించేవారు. అయితే కొండా దంపతులు టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజవకర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు గత కొంతకాలంగా సొంతంగా కార్యక్రమాలు చేపడుతుండటం వీరికి ఇబ్బందిగా మారింది.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా…..

ఎన్నోసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఊహించిన కొండా సురేఖకు నిరాశే ఎదురయింది. అంతేకాకుండా తన నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి ప్రదీప్ రావుల జోక్యం మితిమీరి పోవడంతో వారు కొంతకాలంగా అసహనంతో ఉన్నారు. కొండా దంపతులు పార్టీ మారుతున్నట్లు ఏడాది నుంచి వార్తలు వస్తున్నా… వారు దానిని ఖండిస్తూనే ఉన్నారు.

ఈ నెల 12న కాంగ్రెస్ లోకి……

తాజాగా కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో కొండాసురేఖకు చోటు లేకపోవడం వారిని మరింత బాధించింది. దీంతో వారు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. డి.శ్రీనివాస్ తో సత్సంబంధాలున్న కొండా ఫ్యామిలీ ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల12వ తేదీన వారు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. కొండా ఫ్యామిలీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లు ఇస్తామన్న హామీ లభించడంతో వారు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో వారు చర్చించారు. మొత్తం మీద కొండా ఫ్యామిలీ గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమయింది.