కొండా పెట్టిన లొల్లి మామూలుగా లేదుగా….!

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇందులో ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఉత్కంఠ‌ను రేపేతున్నాయి. అందులోనూ గులాబీ సీటు హాట్‌గా మారుతోంది. ప‌లువురు నాయ‌కులు పోటాపోటీగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో ఎవ‌రికి టికెట్ వ‌స్తుందో.. ఎవ‌రికి రాదో ? కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని పార్టీవ‌ర్గాల‌తోపాటు ప్ర‌జ‌లూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల తొలి జాబితాలో టికెట్‌ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంపై కొండా సురేఖ తీవ్రస్థాయిలో దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఇక కొండా దంప‌తులు టీఆర్ఎస్‌లో కొన‌సాగ‌ర‌ని తేలిపోయింది

కొండా స్థానంలో…..

ఇదే విష‌యాన్నిహైదరాబాద్‌లో విలేకరుల సమావేశం పెట్టిమ‌రి కొండా మురళి, సురేఖ దంపతులు స్ప‌ష్టం చేశారు. కొండా దంప‌తులు చేసిన వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇక ఇదే స‌మయంలో కొండా దంప‌తులు పార్టీ నుంచి వెళ్ల‌డం ఖాయ‌మైపోయిన నేప‌థ్యంలో ఈ టికెట్ కోసం చాలామంది ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కొండా దంప‌తుల‌కు వ్య‌తిరేకంగా జ‌త‌క‌ట్టిన నాయ‌కులు ఇప్పుడు టికెట్ కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. వీరిమ‌ధ్య కూడా టికెట్ కోసం విభేదాలు మొదైల‌న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, న‌గ‌ర మేయ‌ర్‌ నన్నపునేని నరేందర్‌, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు ఉన్నారు.

ఎవరికి వారే తమదేనంటూ……

దాదాపుగా కొండా దంపతుల‌కు వ్య‌తిరేకంగా వీరంద‌రూ ఒక్క‌టిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు టికెట్ కోసం వీళ్ల‌మ‌ధ్య‌నే కొట్లాట మొదైల‌న‌ట్లు తెలుస్తోంది. తమ నాయకుడికే టికెట్‌ వస్తుందని నన్నపునేని నరేందర్‌ అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. బస్వరాజు సారయ్య ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్‌ను కలిశారు. గుండు సుధారాణి కూడా అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానాన్ని వేడుకున్నారు. వీళ్లే కాకుండా.. టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, న్యాయవాది గుడిమళ్ల రవితో పాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లను అధిష్ఠానం సీరియ‌స్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇక్క‌డ‌ మంత్రి కేటీఆర్‌కు శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు కావడంతో ఈ ప్రచారం మరింత పెరుగుతోంది. దాదాపుగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డికే ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

స్థానికేతురుడంటూ……

కానీ.. పోచంప‌ల్లి స్థానికేత‌రుడ‌నీ.. ఆయ‌న‌కెలా ఇస్తార‌ని ఇప్ప‌టికే ప‌లువురు నాయ‌కులు ప్ర‌శ్న‌లు సంధిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. నగరంలోని రెండు స్థానాల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమలో తాజా మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్‌కు కేటాయించారు. ఇక మిగిలింది వ‌రంగ‌ల్ తూర్పు. ఇందులో ఎవ‌రికి ఇచ్చినా.. మిగ‌తావారు స‌హ‌క‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగినా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. టీఆర్ఎస్ పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.