దెబ్బేయడం ఖాయమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళి పార్టీలో చేరినా ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదా? కొండ్రు మురళి పార్టీలో చేరికతో రాజాం నియోజకవర్గంలో విభేదాలు మరింత ముదురుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు రాజాం నియోజకవర్గంలో మూడు గ్రూపులు తయారయ్యాయంటున్నారు. కొండ్రుమురళి పార్టీ కండువా కప్పేసుకున్నాక రాజాం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన ఖాతాలో వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజాం నియోజకవర్గంలో గెలుస్తామన్న ధీమాగా బాబు ఉన్నారు. అందుకే కొండ్రుకు సీటు ఇస్తామన్న గ్యారంటీతోనే పార్టీలోకి చేర్చుకున్నారు.

మరింత ముదిరిన……

కాని కొండ్రుమురళి పార్టీలో చేరిన తర్వాత అక్కడ విభేదాలు సద్దుమణగకపోగా మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది. కొండ్రు మురళి చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిన తర్వాత రాజాం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో ప్రతిభా బారతి రాజాం నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా వ్యవహరించేవారు. అక్కడ గెలవకపోయినా ప్రతిభా భారతే పెత్తనం చేసేవారు. కొండ్రుమురళి పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను కూడా ఆయనకే అధిష్టానం అప్పగించింది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవ్వమని సంకేతాలిచ్చింది. దీంతో కొండ్రు అధికారులతో పాటు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని బిజీగా ఉన్నారు.

ఆయన అనుచరులకే…….

అయితే కొండ్రుతో పాటు ఆయన అనుచరులుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు ఇక్కడ ప్రాధాన్యత లభిస్తుందని అప్పుడే ఫిర్యాదులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా గతంలో ప్రతిభా భారతిని కలిసే వారమని, ఇప్పుడు కొండ్రు అనుచరులను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుందని టీడీపీ క్యాడర్ వాపోతుంది. ఇది మరెవరికో జరగలేదు. సాక్షాత్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అనుచరులకే జరగడంతో వారు వెంటనే కళా వెంకట్రావుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ప్రతిభ దూరంగా…..

రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతి వర్గం ఇప్పటికీ బలంగానే ఉంది. ఆమెకు అన్యాయం జరిగిందని అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిభ కూడా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అలాగే రాజాం నియోజకవర్గంలో కళా వెంకట్రావు వర్గం కూడా బలంగానే ఉంది. అయితే ఈ రెండు వర్గాలను కొండ్రు మురళి కలుపుకుని పోవడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొండ్రు గెలవాలంటే కళా వెంకట్రావు, ప్రతిభా భారతి సహకారం తప్పనిసరి. ఒకవేళ కొండ్రు గెలిస్తే రాజాంలో జెండా పాతేసినట్లేనని, అందువల్ల తమ సహకారం ఎందుకుంటుందని ప్రతిభ వర్గీయులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా కొత్తగా పార్టీలో చేర్చుకుంటే బలం పెరుగుతుందని భావిస్తే..అది బూమరాంగ్ అయ్యేలా ఉందంటున్నారు రాజాం టీడీపీ క్యాడర్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*