కొత్తపల్లి కోట బీటలు వారిందా?

పశ్చిమగోదావరి జిల్లాలో ఇటు గోదావరి గలగలలు… అటు సముద్రపు అలలు హోరుతో గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరగా విస్తరించి ఉన్న నియోజకవర్గం నరసాపురం. పూర్తిగా తీరప్రాంతాన ఉన్న నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం మున్సిపాలిటి, నరసాపురం రూరల్‌, మొగల్తూరు మండలాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వైశాల్యంలోను, ఓటర్ల పరంగా అతి చిన్న నియోజకవర్గం నరసాపురం. సామాజిక సమీకరణల పరంగా చూస్తే ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా కాపు సామాజికవర్గం వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ. కాపులతో పాటు బీసీల్లో బలమైన శెట్టిబలిజ, తీర ప్రాంతాల్లో మత్స‌కారులు కూడా ఉన్నారు.

కొత్తపల్లి కంచుకోటగా…..

ఈ నియోజకవర్గం నుంచే ప్రస్తుత కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మామ‌ పరకాల శేషావతారం మూడు సార్లు, ఆయన భార్య పరకాల కాళికాంబ‌ ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. 1983లో టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌కు పట్టున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత నరసాపురం నియోజకవర్గం టీడీపీకి పూర్తి కంచుకోటగా మారిపోయింది. 1983 నుంచి రెండు ఉప ఎన్నికలతో కలుపుకుని 2014 వరకు జరిగిన ఎన్నికల్లో 2009, 2012 ఉప ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1983 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ప్రతిసారి టీడీపీ అభ్యర్థులే వరుస విజయాలు సాధిస్తున్నారు. 1983, 85లో ఇక్కడ నుంచి సీనియర్‌ రాజకీయ నేత చేగొండి హరిరామజోగయ్య విజయం సాధించారు. 1989 నుంచి నరసాపురాన్ని మాజీ మంత్రి ప్రస్తుత ఏపీ కాపు కార్పోరేషన్ చైర్మ‌న్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు తన కంచుకోటగా మార్చుకున్నాడు.

ఈసారి కొత్తపల్లి…..

1989, 1994లో వరుస విజయాలు సాధించిన ఆయన 1996లో నరసాపురం ఎంపీగా విజయం సాధించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో సుబ్బారాయుడు సోదరుడు కొత్తపల్లి జానకిరామ్‌ విజయం సాధించారు. తిరిగి 1999, 2004లో గెలిచిన సుబ్బారాయుడు 2009లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌రాజు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సుబ్బారాయుడు ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి ఆయన టీడీపీలోకి జంప్‌ చేసి ప్రస్తుతం ఏపీ కాపు కార్పోరేషన్ చైర్మ‌న్‌గా కొనసాగుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన బండారు మాధవనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు కొత్తపల్లి సుబ్బారాయుడిపై 21వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

సమస్యలు చాలానే ఉన్నా……

నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఆయనకు కొంత వరకు మంచి మార్కులే వెయ్యవచ్చు. నియోజకవర్గంలో సీసీ రహదారుల నిర్మాణంతో పాటు తీర ప్రాంతాల్లో ర‌హ‌దారుల అభివృద్ధితో పాటు నరసాపురం – కోటిపల్లి రైల్వే లైను, వశిష్ఠ గోదావరిపై వంతెన నిర్మాణానికి తన వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. తీర ప్రాంతం కావడంతో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఇంక పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. అయితే రాజకీయంగా మాత్రం కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి టీడీపీలోకి రావడం… దశాబ్దాలుగా కొత్తపల్లి నరసాపురంలో పాతుకుపోవడంతో మాధవనాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనుకు గొయ్యి అన్న చందంగా మారింది. అటు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పొసగ‌ని పరిస్థితి ఉన్నా ఆయనను నేరుగా ఢీ కొట్టే సాహసం చెయ్యలేక తన కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు… సాధ్యమైనంత వరకు వివాదాలకు తావులేకుండా పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను నడిపిస్తున్నారు.

టీడీపీలో ఆధిపత్య పోరు…..

పార్టీ కార్యక్రమాల్లో గత ఏడాదిన్నర కాలంగా సుబ్బారాయుడు వర్సెస్‌ మాధవనాయుడు మధ్య‌ నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు నియోజకవర్గంపై పట్టు కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. సుబ్బారాయుడు ఎంత సీనియర్‌ అయినా… మాధవనాయుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలాగైన తనకే సీటు వస్తుందన్న ధీమాతో అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే సుబ్బారాయుడు రాజకీయ భవిష్యత్తు ముగుస్తుంది అనుకున్న టైమ్‌లో ఏపీ కాపు కార్పోరేషన్‌ చైర్‌మేన్‌ ద్వారా రాజ‌కీయ పున‌ర్జ‌న్మ పొందారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్య‌క్ష ఎన్నికల్లో పోటీ చేసి నరసాపురం నుంచి విజయం సాధించాలని ఎలాగైనా సీటు దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటుపై ఇటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాధవనాయుడుతో పాటు అటు సుబ్బారాయుడు ధీమాగా ఉండడంతో టీడీపీ సీటుపై క్లారిటీ లేదు. కాని ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మాధవనాయుడిని చంద్రబాబు కొనసాగించ వచ్చని ఎక్కువ మంది చెబుతున్నారు.

దురదృష్టం ఆయన వెంటే…..

విపక్ష వైసీపీ విషయానికి వస్తే 2004 నుంచి నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్‌రాజును ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. 2004లో సుబ్బారాయుడిపై స్వల్ప తేడాతో ఓడిన ఆయన 2009లో ఘన విజయం సాధించారు. అయితే 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి సుబ్బారాయుడి చేతులో ఓడిన ప్రసాద్‌రాజు గత ఎన్నికల్లో సుబ్బారాయుడు వైసీపీలోకి రావడంతో ఆయన కోసం తన సీటు త్యాగం చేసి తాను ఆచంటలో ప్రస్తుత మంత్రి పితాని సత్యనారాయణపై పోటీ చేసి 2500 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తిరిగి సుబ్బారాయుడు టీడీపీ గూటికి చేరుకోగా ఇప్పుడు ప్రసాద్‌రాజు నరసాపురం వైసీపీ నియోజకవర్గ పగ్గాలు స్వీకరించారు. నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా పరిచయం ఉండడం, పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నా డెల్టాలో ఉన్న సామాజిక సమీకరణల సేపథ్యంలో ప్రసాద‌రాజుకు ఫైన‌ల్‌గా సీటు వస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది.

అన్వేషణలో వైసీపీ…..

ఇప్పటికే డెల్టాలో జగన్ ఉండి, ఆచంట సీట్లను క్ష‌త్రియలకు ఇవ్వడంతో పాటు నరసాపురం ఎంపీ సీటును సైతం ఈ వర్గానికే కేటాయించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నరసాపురంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఎవరైన దొరుకుతారా అన్న కోణంలో కూడా వైసీపీలో అన్వేషణ జరుగుతుంది. మరి జగన్‌ తనను నమ్ముకున్న ప్రసాద్‌రాజుకు న్యాయం చేస్తాడా లేదా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్ధాక్షణ్యంగా జరుగుతున్న మార్పులు నరసాపురం నియోజకవర్గంలో కూడా అమలు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నరసాపురం కూడా ఒకటి. మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఇది సొంత నియోజకవర్గం. వీరి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని మొగల్తూరు కావడంతో ఇక్కడ జనసేన ప్రభావం గట్టిగా ఉండనుంది.

జనసేన సంచలనం చేస్తుందా?

అన్ని సమీకరణల నేపథ్యంలో జనసేన నుంచి ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెడితే జనసేన సంచలనం నమోదు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త క‌ల‌వ‌కొల‌ను నాగతులసీరావు జనసేనలో కీలక పాత్రధారిగా ఉన్నారు. మరి జనసేన టిక్కెట్‌ కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నా ఫైనెల్‌గా ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో నరసాపురంలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య‌ హోరాహోరి పోరు తప్పేలా లేదా. సామాజిక సమీకరణల నేపథ్యంలో చూస్తే వైసీపీ సరైన ఛాయిస్‌ తీసుకోకపోతే ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడక తప్పని పరిస్థితి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*