కేటీఆర్ కోటరీ నిజమేనా..?

మళ్లీ తాను ముఖ్యమంత్రిని అవుతాను అంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకటికి రెండు సార్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ నేతలు కూడా చెబుతున్నారు. అయితే, ఎంత క్లారిటీ ఇస్తున్నా ఆయన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారని, కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం కూడా ఉంది. ఇక ప్రతిపక్ష నేతలైతే కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్నారని, కేటీఆర్ ను గద్దె ఎక్కించడానకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని పదేపదే విమర్శలు చేస్తున్నారు. అయితే, కేటీఆర్ ఓ కోటరీని తయారు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ పై తిరుగుబావుటా ఎగరవేసిన కొండా సురేఖ ఆరోపించారు. అయితే, టీఆర్ఎస్ లో కేటీఆర్ కు ప్రత్యేకంగా కోటరీ ఉందా అనే అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతోంది.

తండ్రికి తగ్గ తనయుడే అయినా…

తెలంగాణ రాష్ట్ర సమితికి, కేసీఆర్ కు రాజకీయ వారసుడు కేటీఆర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. నిజానికి ఆయన తండ్రికి తగ్గ వారసుడే. పాలనలో అనుభవం, అన్ని అంశాల్లో విషయ పరిజ్ఞానం, వాక్పటిమ, ఇలా ఏ అంశంలో చూసినా కేటీఆర్ తండ్రికి తగ్గ కుమారుడు అనాల్సిందే. అయితే, టీఆర్ఎస్ కి గానీ, ప్రభుత్వానికి గానీ కేసీఆర్ నాయకత్వం దక్కించుకోవడం అంత సులువు కాదంటారు కొందరు విశ్లేషకులు. కేటీఆర్ కంటే ముందు నుంచే హరీష్ రావు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా కేసీఆర్ అప్పజెప్పిన పనులన్నీ విజయవంతంగా నెరవేర్చారు. కేటీఆర్ కు నాయకత్వం ఇవ్వడానికి హరీష్ రావు అంగీకరించరనే వాదన కూడా ఉంది. అదే పరిస్థితి వస్తే ఒకదశలో హరీష్ రావు వెంట సగానికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది.

కేటీఆర్ కు పెరిగిన ప్రాధాన్యత…

అయితే, పార్టీలో, ప్రభుత్వంలో తర్వాతి పరిణామాలు చూస్తే హరీష్ రావు కంటే కేటీఆర్ కు ప్రాధాన్యత పెరిగిన మాట అంగీకరించాల్సిన వాస్తవం. ఆయనను క్రమంగా పార్టీ కార్యక్రమాల బాధ్యతల నుంచి తప్పించి కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఇటీవల కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగింది. సభ కోసం నియమించిన ఏ కమిటీలోనూ, సభ ఏర్పాట్లలోనూ హరీష్ రావు కనిపించలేదు. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ ప్రగతి నివేదన సభ తర్వాత హఠాత్తుగా హరీష్ కు మళ్లీ కొంత ప్రాధాన్యత కనిపిస్తోంది. హుస్నాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆయనే చూసుకున్నారు. ఎంత కలిసిమెలిసి కనపడ్డా ఇలా అప్పుడప్పుడు కేటీఆర్, హరీష్ రావు మధ్య వారసత్వ వార్ ఏమైనా ఉందా..? అనే అనుమానాలు వస్తున్నాయి.

అన్ని జిల్లాల్లో తన మనుషులుగా…

అయితే, గత నాలుగేళ్లుగా కేటీఆర్ ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా మారిపోయారు. అన్ని జిల్లాలో ప్రత్యేకంగా తన మనుషులుగా కొంతమందిని తయారుచేసుకున్నట్లు కనపడుతోంది. ముఖ్యంగా యువ ఎమ్మెల్యేలు వారివారి జిల్లాల్లో కేటీఆర్ కుడిభూజాలుగా చలామణీ అవుతున్నారు. ఇక పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపు తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ కు దగ్గరగా కనిపిస్తున్నారు. ఏ పని ఉన్నా కేటీఆర్ నే ఆశ్రయిస్తున్నారు. ఇది కోటరీ అని భావించకున్నా కేటీఆర్ మాత్రం తనకంటూ అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలను తయారుచేసుకున్నారు. ఇప్పుడు కూడా టిక్కెట్ల పంపిణీలోనూ కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తూ ఆయన మనుషులు అందరికీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అయితే, భవిష్యత్ లో పార్టీ పూర్తిగా కేటీఆర్ కనుసన్నల్లోనే ఉండేలా కేటీఆర్ చర్యలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారసత్వం కోసం ఒకవేళ పోటీ ఏర్పడినా కేటీఆర్ సునాయసంగా నెగ్గుకురావడానికే భారీ వ్యూహంతోనే ఈ చర్యలు ఉన్నాయనే వాదన ఉంది. మరి కొండా సురేఖ ఆరోపించినట్లుగా కోటరీ కాకున్నా కేటీఆర్ మాత్రం పార్టీలో తనకు ఎదురు లేకుండా మార్చుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*