కుమార టార్గెట్ అదేనా?

కుమారస్వామి గతంలో మాదిరి కాకుండా కొంత తగ్గి మరికొంత సంయమనం పాటిస్తూ పాలన సాగించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకేనేమో కాంగ్రెస్ పెట్టే షరతులతో పాటు పార్టీలో తాను తక్కువ కాకూడదని భావించి తాను అనుకున్న వాటిని కూడా సాధించేందుకు కుమారస్వామి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కుమారస్వామి కొంత సక్సెస్ అయినట్లుగానే కన్పిస్తున్నారు. కుమార ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటేనన్న వ్యాఖ్యలు, విమర్శలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను పూర్తి కాలం పాలన చేయాలన్న ధ్యేయంతోనే ఆయన ముందుకు సాగుతున్నారు.

తేలిన పంచాయతీ……

ఈ నెల 6వ తేదీన కుమారస్వామి మంత్రివర్గం కొలువుదీరబోతోంది. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ నేతలతో జరిపిన మంతనాలు ఫలవంతమయ్యాయి. కొంత తగ్గినట్లుగానే కన్పించినా ఆర్థిక శాఖలో మాత్రం బెట్టు వీడలేదు. చివరకు రాహుల్ గాంధీ వరకూ వెళ్లిన ఈ పంచాయతీలో కుమారస్వామికే ఆర్థిక శాఖను అప్పగించలని నిర్ణయానికి వచ్చారు. సాంప్రదాయంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రుణమాఫీ, ఎన్నికల ప్రణాళిక అమలులో ఆర్థిక శాఖ కీలకం కానుండటంతో రాహుల్ ను ఒప్పించి మరీ కుమారస్వామి ఫైనాన్స్ ను తన వద్దే అట్టిపెట్టుకుంటున్నారు.

కాంగ్రెస్ కూడా తగ్గి…..

మరోవైపు కాంగ్రెస్ కూడా తెగేదాకా లాగదలచుకోలేదు. పట్టుదలకు పోతే ప్రభుత్వ మనుగడకే ముప్పు వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ కుమార డిమాండ్ ను అంగీకరించింది. కీలకమైన శాఖలను తీసుకోవడంలో కుమారస్వామి విజయం సాధించారన్నది జేడీఎస్ వర్గాల టాక్. జనతాదళ్ కు ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఎక్సైజ్, కో-ఆపరేటివ్, ఉన్నత విద్య, విద్యుత్తు, ప్రజాపనుల శాఖలను సాధించుకున్నారు. కాంగ్రెస్ కు హోం, వ్యవసాయం, రెవెన్యూ, బెంగుళూరు నగర అభివృద్ధి వంటి శాఖలను అప్పగించారు. సుదీర్ఘ చర్చల అనంతరం రెండు పార్టీలు మంత్రి వర్గ కూర్పుపై ఒక నిర్ణయానికి రావడం వెనక కుమారస్వామి చాలా శ్రమించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఉమ్మడి ప్రణాళికతో…..

ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు వేర్వేరుగా ఎన్నికల ప్రణాళికలను ప్రజల ముందుంచాయి. వాటి అమలు బాధ్యత రెండు పార్టీలపైనా ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో వేర్వేరు ప్రణాళికలను కాకుండా ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈకమిటీకి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వం వహిస్తారు. రెండు పార్టీల్లోని ముఖ్యమైన హామీలను ఒకచోట చేర్చి వాటిని అమలు చేసేందుకు ఈ కమిటీ పలు సూచనలు చేయనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఉమ్మడి ప్రణాళికను అమలు పరుస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కుమారస్వామి ఐదేళ్లు టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*