జత కడితే….జత….కడితే…?

ఒకే ఒక్కడు. ఆయనే ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ కూడా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు జటిలం కావడంతో కుమారస్వామితో పాటు పరమేశ్వర్  ఒక్కరే రేపు ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించింది. కుమారస్వామి తన మంత్రివర్గసహచరులతో కలిసి ప్రమాణస్వీకారం చేద్దామని భావించారు. అయితే నిన్న ఢిల్లీ వెళ్లిన కుమారస్వామి కాంగ్రెస్ అధినేతలతో చర్చించినా ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రులు, కీలక మంత్రి పదవులపై జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య అవగాహన రాలేదు. కీలకమైన విద్యుత్తు, హోంశాఖ, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యశాఖలను తమకే కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే హోంమంత్రి పదవి ఇచ్చేందుకు కుమారస్వామి సుముఖంగా లేనట్లు సమాచారం.

పన్నెండేళ్ల తర్వాత…..

దాదాపు పన్నెండేళ్ల తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ లు కలిసి కర్ణాటకలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే మరోవైపు మంత్రి పదవుల పంపంకంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా పదవుల పందేరం పంచాయతీని లోకల్ లీడర్లకే వదిలేసింది. 78 స్థానాలున్న తమకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించాలన్నది కాంగ్రెస్ డిమాండ్ గా ఉంది. 38 సభ్యులున్న జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని, తమకు కీలకమైన పోస్టులతో పాటు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి….

మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నా అందుకు కుమారస్వామి అంగీకరించడం లేదు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న లింగాయత్ లు కుమారస్వామిపై మండిపడుతున్నారు. తాము మద్దతిస్తే ముఖ్యమంత్రి అవుతున్నారన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కర్ణాటక ఇన్ ఛార్జి వేణుగోపాల్ అసంతృప్త ఎమ్మెల్యేలను రిసార్ట్స్ లో శాంతింప చేస్తున్నారు. తాము అనుకున్నట్లే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని వేణుగోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారని చెబుతున్నారు.

ప్రమాణ స్వీకారానికి…..

అలాగే రేపు జరగబోయే కుమారస్వామి ప్రమాణస్వీకారానికి దేశంలోని బీజేపీ యేతర నాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదిరులు హాజరవుతున్నట్లు సమాచారం. దాదాపు 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెబుతున్నారు. ధూంధాంగా కుమారస్వామి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ ముందు ముందు ముప్పు తప్పదంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*