కబంధ‘హస్తం’లో కుమార

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి క్రమంగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ వల్లనే ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఆ పార్టీ ఆదేశాలను పాటించని పరిస్థితి. అదే విషయాన్ని ఆయన స్వయంగా కూడా వెల్లడించడం విశేషం. తాను కాంగ్రెస్ పైనే ఆధారపడి ఉన్నానని కుమారస్వామి వ్యాఖ్యానించారు. తనను కన్నడ ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ వల్లనే తాను ముఖ్యమంత్రిని కాగలిగానని, ఆ పార్టీతో ఏం చర్చించకుండా అడుగు కూడా ముందుకు వేయనని కుమారస్వామి చెప్పడం ఆయన పరిస్థితికి అద్దం పడుతోంది.

ఆర్థిక శాఖ కూడా…..

కాంగ్రెస్ 78, జనతాదళ్ కు 37 స్థానాలు వచ్చినా కుమారస్వామిని బీజేపీ మీద అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది. అయితే ముఖ్యమైన పదవుల విషయంలో కుమారస్వామి మొదట్లో కొంత పట్టుదలకు పోయినా చివరకు చల్లబడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక శాఖను తన వద్ద గాని, జేడీఎస్ కు గాని ఇవ్వాలన్నది కుమారస్వామి ఆలోచన. అయితే కాంగ్రెస్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ కు ఆర్థికశాఖ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ కుమారస్వామి ముందుంచడంతో ఆయనకూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రెండు మూడు రోజుల్లో…..

ఇక రెండు, మూడురోజుల్లో మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి కర్ణాటకలో పాలనను పరిగెత్తించాలని కుమారస్వామి చూస్తున్నారు. కాంగ్రెస్ కు 22 , జేడీఎస్ 12 చొప్పున పదవులు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అంకే ఓకే కాని ఎవరనేది ఇంతవరకూ తేలలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లేముందు కుమారస్వామితోనూ, కర్ణాటక కాంగ్రెస్ నేతలతో పదవుల విషయమై చర్చించారు. సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం పదవులను ఇవ్వాలన్నది రాహుల్ ఆలోచన. ఈ పదవుల పంపకం ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పడకుండా ఉండాలని కన్నడ కాంగ్రెస్ నేతలకు జాగ్రత్తలు చెప్పి మరీ విదేశాలకు వెళ్లారు.

రాహుల్ ఫార్ములా…..

స్పీకర్ పదవి కాంగ్రెస్ దే కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి జేడీఎస్ కు ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ లో లింగాయత్ వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలన్న రాహుల్ సూచన మేరకు ఎంబీ పాటిల్, శివశంకరప్పకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు డీకే శివకుమార్, రామలింగారెడ్డి, జార్జి, ఆర్వీ దేశ్ పాండే, రోషన్ బేగ్, సతీష్ జర్కోలీ వంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. మంత్రి వర్గం ప్రమాణస్వీకారం సోమ లేదా బుధవారాల్లో ఉండొచ్చని తేలింది. కుమారస్వామి మాత్రం ఇప్పటి వరకూ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లే నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ ను కాదని చేయగలిగిందేమీ లేదు కాబట్టి కుమారస్వామి కూడా పట్టుదలకు పోకుండా వెళుతున్నట్లు జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*