కుమారస్వామికి చుక్కలు కనపడుతున్నాయే….!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యానన్న సంతోషం ఏమాత్రం ఉండటం లేదు. ఆయన పాలనపై దృష్టి పెట్టాలన్నా కుదరడం లేదు. కాంగ్రెస్ కుమారస్వామికి చుక్కలు చూపుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కర్ణాటకలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కుమారస్వామి పాలిట సంకటంగా మారింది. అతి తక్కువ స్థానాలు వచ్చినా ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా భావించాలో….కాంగ్రెస్ గీచిన గీత దాటకుండా ఉండాలో? తెలియని పరిస్థితి ఆయనలో ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. అందుకే ఆయన ఈమధ్య ఉద్వేగానికి గురవుతున్నారు.

ముఖ్యమైన మంత్రిపదవులన్నింటినీ…..

ముఖ్యంగా ప్రధానమైన మంత్రిపదవులన్నింటినీ కాంగ్రెస్ తమకు కావాలని కోరుతుంది. ముఖ్యమంత్రి పదవి జేడీఎస్ కు ఇవ్వడంతో ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులను తామే తీసుకుంటామని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. ఇప్పటి వరకూ ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ప్రధానంగా కాంగ్రెస్ ముఖ్యమైన మంత్రి పదవులను కోరుకుంటోంది. ఆర్థిక శాఖ, హోంశాఖ, పరిశ్రమల శాఖ, ఐటీ, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖలను తమకు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలోకి డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులు వచ్చేశాయి.

జేడీఎస్ కు సాధారణ పోర్ట్ ఫోలియోలే…..

అయితే ఇందుకు కుమారస్వామి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన శాఖలన్నీ కాంగ్రెస్ కు అప్పగిస్తే ఇక తన మార్క్ పాలన ఉండదని కుమారస్వామి సంశయిస్తున్నారు. అయినా తప్పదు. ప్రస్తుతం కాంగ్రెస్ తో కలసి ఉండాల్సిన పరిస్థితి. జనతాదళ్ ఎస్ కు కాంగ్రెస్ ఆఫర్ చేసిన పదవులను చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారట. జనతాదళ్ ఎస్ కు రెవెన్యూ, పీడబ్ల్యూడీ, యువజన సంక్షేమం, మహిళ సంక్షేమం, వ్యవసాయ శాఖలను తీసుకోవాలని షరతులను విధిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు, జేడీఎస్ కు పదవుల పంపకంలో అంకెల్లో అవగాహన కుదిరింది. కాంగ్రెస్ కు 21, జేడీఎస్ కు 12 మంత్రి పదవులును తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.

అందువల్లే అసహనమా?

ఈ చర్చల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతోనే కుమారస్వామి ఇటీవల అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తాను కాంగ్రెస్ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని, ప్రజల ఆశీర్వాదంతో కాదని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారమే లేపాయి. కన్నడ ప్రజలను కుమారస్వామి అవమానించారంటూ పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై కుమారస్వామి స్పందించారు. తాను ప్రజలను అవమానించాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, భాగస్వామి గట్టిగా కోరుకోవడం వల్లనే తాను సీఎం అయ్యానని చెప్పడం తన ఉద్దేశ్యమని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తం మీద కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తుంది. మరి కుమారస్వామి దీన్నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*