కుమారస్వామి భయపడుతున్నారెందుకు?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంకా కుదురుకోలేదు. అనుక్షణం ఆయన అభద్రతతోనే గడుపుతున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి ఇదే అర్థమవుతుంది. ఏం నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోలేనని, కఠిన నిర్ణయాల జోలికి పోలేనని, అవి తీసుకుంటే తనను కూడా తప్పించే వ్యవస్థ ఉందని ఆయన అనడం సంచలనమే అయింది. ఒకరకంగా కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కుమారస్వామి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రతి నిర్ణయాన్ని సమన్వయ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది.

సమన్వయ కమిటీ చెబితేనే…..

మంత్రి వర్గ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోనూ, జనతాదళ్ ఎస్ లోనూ అసంతృప్తుల సంఖ్య మరింత పెరగడం రెండు పార్టీలకూ ఆందోళన కల్గించే అంశమే. ప్రతి నిర్ణయాన్ని సిద్ధరామయ్య నేతృత్వంలోని సమన్వయ కమిటీ ఓకే చేస్తేనే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. సిద్ధరామయ్య గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకున్న అనుభవం కుమారస్వామి తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రశ్నలు జనిస్తాయని చెప్పకతప్పదు. మరోవైపు తండ్రి దేవెగౌడ జోక్యం కూడా పెరిగిపోయిందన్న టాక్ బలంగా విన్పిస్తోంది. దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం ముళ్లమీదనే కూర్చున్నట్లుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అందుకే కుమారస్వామి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

బీజేపీ అదను కోసం…..

మరోవైపు ప్రతిపక్షం కాచుక్కూర్చుని ఉంది. అసమ్మతి నేతల తీరును భారతీయ జనతా పార్టీ నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా యడ్యూరప్ప కుమారస్వామి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశముంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా రాష్ట్రాధినేతకు ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే రైతు రుణ మాఫీ అమలు చేయలేదంటూ యడ్యూరప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ప్రజలు తమను ఆదరించినా, రెండు పార్టీలూ కుమ్మక్కై ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారని ఆయన జనం మధ్యలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మంత్రివర్గంలో సమన్వయం ఏదీ?

ఇక మంత్రివర్గ సభ్యులు కూడా రెండుగా చీలిపోయినట్లు కన్పిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో రెండు పార్టీలకు చెందిన మంత్రులు కలసి, సమన్వయంతో పనిచేస్తేనే కొంతమేర అభివృద్ధి సాధ్యమవుతుంది. కాని ఇప్పుడు శాఖల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మంత్రులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించాలని కుమారస్వామి నిర్ణయించారు. మొత్తం మీద కర్ణాటకలో కుమారస్వామి ప్రతిరోజూ కఠిన పరీక్షే నన్నది చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*