కుమారకు మరోసారి…తప్పదా?

కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి మంత్రివర్గ విస్తణకు పూనుకోక తప్పదా? అవును… మరోసారి తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కుమారస్వామి రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కర్ణాటక మంత్రివర్గాన్ని విస్తరించి పదిరోజులవుతుంది. అయితే తమకు మంత్రి పదవులు లభించడం లేదని కొందరు సీనియర్ నేతలు తమ అసమ్మతిని బాహాటంగానే వెళ్లగొక్కారు. వివిధ జిల్లాల్లో తమ నేతకు మంత్రి పదవి లభించడం లేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు కూడా దిగుతున్నాయి.

అసమ్మతి నేతల కోసం……

ముఖ్యంగా ఎంబీ పాటిల్ ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలసి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవిదక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎంబీ పాటిల్ శిబిరంలో మరో పది మంది వరకూ అసమ్మతినేతలున్నారు. ఇక హెచ్.కె. పాటిల్, రామలింగారెడ్డి వంటి నేతలు తమకు మంత్రి పదవులను ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. తమ సినియారిటీ, పార్టీకి తాము చేసిన సేవలను గుర్తించి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఒకవైపు వినతులు ఇస్తూనే మరోవైపు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. త్వరితగతిన మంత్రివర్గ విస్తరణచేయాలని వారు పట్టుబడుతున్నారు.

నేతలతో అధిష్టానం చర్చలు…..

అసమ్మతి నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ చర్చలు జరిపారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వారికి సంకేతాలు ఇచ్చారు. అసమ్మతి నేతలతో విడివిడిగా సమావేశమైన వేణుగోపాల్ రెండేళ్లకొకసారి మంత్రి పదవులను మార్చే అంశం ఇంకా అధిష్టానం పరిశీలనలో ఉందని చెప్పినట్లు సమాచారం. అప్పటి వరకూ ఓపిక పట్టాలని, గెలిచిన వారందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని, అలాగని సీనియర్ నేతలను పక్కన పెట్టడం కూడా సరికాదని వేణుగోపాల్ చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఓపిక, సహనం అవసరమని కూడా అసమ్మతి నేతలకు కొందరికి క్లాస్ పీకారు.

కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…..

అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కేవారికి మాత్రం వేణుగోపాల్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రులు సతీష్ జార్కి హోళి, వి.మునియప్ప, శివళ్లి, పరమేశ్వర నాయక్, తన్వీర్ సేఠ్ వంటి వారు కొంత గట్టిగానే తమకు మంత్రి పదవులను ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే కుమారస్వామి తన మంత్రి వర్గ విస్తరణకు మరోసారి రెడీ అవుతున్నారని కూడా చెబుతున్నారు. ఇది కేవలం కాంగ్రెస్ అసమ్మతి నేతల కోసమేనన్నది ఆ పార్టీ వర్గాల నుంచి విన్పిస్తుంది. కుమారస్వామి మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. మరి ఆరుగురితో విస్తరణ చేస్తారా? లేక కొంతమందితోనే సరిపెడతారా? అన్నది తేలాల్సి ఉంది. కుమారస్వామి మాత్రం కాంగ్రెస్ చేతిలోనే మంత్రి వర్గ విస్తరణ ఉందని చెబుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*