కుమార కాన్ఫిడెన్స్ అదే….!

రహస్య సమావేశాలు…ముఖ్యనేతలతో మంతనాలు… ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్. ఇదీ కర్ణాటకలో రాజకీయం పరిస్థితి. సంకీర్ణ సర్కార్ ను కూల్చి వేయాలన్న ఆలోచనలో బీజేపీ, సర్కార్ ను కాపాడుకోవాలని కాంగ్రెస్ కసరత్తులు గట్టిగానే చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 14 మంది నుంచి 16 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ బీజేపీ నేతలు చెబుతుండగా, బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. అయితే సాంకేతికంగా చూస్తే కర్ణాటకలో ఇప్పటికిప్పుడు సంకీర్ణ సర్కార్ ను కూల్చడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కుమారస్వామి ధీమాగా ఉన్నారు.

మారినా…రాజీనామా చేసినా……

బీజేపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరినా వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే సంకీర్ణ సర్కార్ లో స్పీకర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన వారు కాబట్టి పార్టీ మారితే వెనువెంటనే అనర్హత వేటు వేయడానికి ఏమాత్రం కాంగ్రెస్ వెనక్కు తగ్గదు. ఇక రాజీనామాలు చేస్తే వాటిని స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పట్లో వాటిని స్పీకర్ ఆమోదించకపోయినా పోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, చేయకుండా బీజేపీలోకి వెళ్లినా వారికే నష్టమన్నది కాంగ్రెస్ నేతల ధీమా. అందుకే వారు బిందాస్ గా ఉన్నారని చెబుతున్నారు.

అవిశ్వాసం పెట్టాలన్నా…..

మరోవైపు అవిశ్వాసం పెట్టాలన్నా ఇప్పట్లో సాధ్యం కాదు. రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి కుమారస్వామి బలనిరూపణ శాసనసభలో చేసుకున్నారు. ఒకసారి అవిశ్వాసం, విశ్వాస పరీక్షలు జరిగితే తిరిగి ఆరు నెలల వరకూ సభలో విశ్వాసం, అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. అంటే బలనిరూపణ చేసుకోవాలని కుమారస్వామిని కోరాలన్నా కమలం పార్టీకి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే నాలుగు నెలల వరకూ వెయిట్ చేయక తప్పట్లు లేదు కమలనాధులకు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారంటున్నారు.

లోక్ సభ ఎన్నికల వరకూ……

అంతేకాకుండా త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగుతాయి. ఈలోపు అవిశ్వాసంపెట్టి కుమారస్వామి సర్కార్ ను పడగొడితే అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. దేశంలో ప్రధాన సామాజిక వర్గాలు కమలనాధులకు దూరమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వరకూ బీజేపీ సంకీర్ణ సర్కార్ ను కూలదోసేందుకు ప్రయత్నించదని కుమారస్వామి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన మౌనంగా ఉంటునట్లు నటిస్తూ మరోవైపు బీజీపీపై చిందులు తొక్కుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి వస్తే ఇక తనను కదిలించే వారుండరన్నది దీమా.అయితే మంత్రి వర్గ విస్తరణ ఇంకా జరగకపోవడంతో కాంగ్రెస్ అసంతృప్తనేతలు రహస్య సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*