భారంగా….భయభయంగా….?

వంద రోజుల పాలన పూర్తయింది. ఎన్నో సవాళ్లు…ఎన్నో సమస్యలు…అన్నింటినీ అధిగమిస్తూ వెళుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి వంద రోజులు కావస్తోంది. వంద రోజుల్లో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ వంద రోజుల్లోనూ వారానికి ఒక ఆలయాన్ని సందర్శిస్తూ కుమారస్వామి తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నా ఆయన ఆలయ, మఠాల సందర్శలను మాత్రం వదిలిపెట్టలేదు. కుమారస్వామి ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికలకు ముందు కూడా కింగ్ మేకర్ తామేనంటూ జనతాదళ్ (ఎస్) నేతలు చెబుతున్నా ఎవరూ పెద్దగా నమ్మలేదు.

ఊహించని విధంగా…..

అయితే కర్ణాటక శాసనసభ ఫలితాలు వెలువడిన తర్వాత ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువ కాలేకపోవడం, బీజేపీ అతి పెద్ద పార్టీగా, కాంగ్రెస్ రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాత్రికి రాత్రే చర్చలు జరిపి జేడీఎస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 37 సీట్లు దక్కించుకున్న జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమయింది. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలతో చర్చలు జరిపిన ఆజాద్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమికను పోషించారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.

సంతోషం లేకుండానే…..

కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సంతోషంగా లేరన్నది వాస్తవం. ఎన్నికల మ్యానిఫేస్టోలో రైతు రుణమాఫీని ప్రకటించిన జనతాదళ్ ఎస్ అమలు చేయడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేతలు బడ్జెట్ సమావేశాల వద్దని చెప్పడంతో, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. ఆ బడ్జెట్ లోనే రైతు రుణమాఫీకి నిధులు కేటాయించారు. ఈ వందరోజుల్లో అప్పుడప్పుడూ కుమారస్వామి ఉద్వేగానికి కూడా లోనయ్యారు. తనను ప్రజలు ఎందుకు గెలిపించలేదని, ఎందుకు నమ్మలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లనే తాను ముఖ్యమంత్రినయ్యానని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత దానిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల వరకూ తానే ముఖ్యమంత్రి నంటూ కూడా వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

అన్నీ తలనొప్పులే…..

ఇప్పుడిప్పుడే కుమారస్వామి కుదుట పడుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఉపముఖ్యమంత్రి పరమేశ్వర, హైకమాండ్ వద్ద గ్రిప్ ఉన్న డీకే శివకుమార్ లతో సాన్నిహిత్యాన్నిపెంచుకున్నారు. వారిని కలుపుకుని పోతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న విషయాలకు కూడా ఢిల్లీ మీద ఆధారపడటం ఇష్టం లేని కుమారస్వామి అప్పడప్పుడూ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరచూ తనను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కుమరాస్వామి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణ కూడా కుమారస్వామికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్, జేడీఎస్ లను రెండింటినీ కలుపుకుని ముందుకు వెళ్తున్న కుమారస్వామికి ఈ వంద రోజులు భారంగానే గడిచాయని చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*