ఒక్కరోజుకే ఇదేందప్పా….?

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా రోజు కూడా గడవలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కుమారస్వామి శుక్రవారమే తన బలాన్ని నిరూపించుకున్నారు. దాదాపు పదిహేను రోజుల పాటు క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గాలకు వెళ్లి తమను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే పనిలో పడ్డారు. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఫెవికాల్ లాంటి బంధం కుదిరినట్లేనని అందరూ భావించారు. కాని తాజాగా ఎన్నికల జరిగే నియోజకవర్గంలో జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య విభేదాలు బయటపడటం ఆందోళన కల్గిస్తుంది.

రాజరాజేశ్వరి నగర్ లో…..

కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు ముందు నకిలీ ఓటర్ కార్డులు దొరికాయని రాజరాజేశ్వరి నగర్ ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నిక వచ్చే సోమవారం జరగనుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసి ఉండటంతో జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూటమిగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికలో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. కర్ణాటకలో రాజరాజేశ్వరి నగర్ తో పాటు, పోలింగ్ కు ముందు అభ్యర్థి మరణించడంతో జయానగర్ కు, కుమారస్వామి రాజీనామా చేసిన రామనగర్ కు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

ఇరు పార్టీల అభ్యర్థులూ…..

అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మునిరత్న పోటీ పడుతున్నారు. జేడీఎస్ అభ్యర్థిగా రామచంద్ర ప్రచారం చేసుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగే ఉప ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని, బీజేపీని ఎదుర్కొనాలని కాంగ్రెస్, జేడీఎస్ లు నిర్ణయించాయి. అయినా అభ్యర్థులిద్దరూ మంకుపట్టుపట్టడంతో రెండు పార్టీలకూ పాలుపోవడం లేదు. కాంగ్రెస్ ఈ స్థానాన్ని తమకే ఇవ్వాలని కోరుతుంది. జేడీఎస్ అందుకు అంగీకరించినా అభ్యర్థి రామచంద్ర మాత్రం అంగీకరించలేదు. సోమవారం ఎన్నిక కావడంతో మరోసారి అభ్యర్థులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్ నిర్ణయించారు. మరి ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయో? లేదో? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*