రిపోర్ట్ టు హైకమాండ్….!

సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడి నేటికి వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీ వెళ్లి మరీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆయనకు ‘‘హండ్రెడ్ డేస్ రిపోర్ట్’’ ఇచ్చినట్లు సమాచారం. మర్యాదపూర్వకంగానే రాహుల్ ను కలిశానని కుమారస్వామి చెబుతున్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తుతున్న సమస్యలు, పాలనపరంగా ఏర్పడుతున్న ఇబ్బందులను రాహుల్ దృష్టికి కుమారస్వామి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ గురించి కుమారస్వామి రాహుల్ వద్ద ప్రస్తావనకు తెచ్చినట్లు చెబుతున్నారు.

మంత్రి వర్గ విస్తరణపై…..

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అయితే రాహుల్ విదేశీ పర్యటనల హడావిడి ఉండటం, రాఫెల్ కుంభకోణంపై సీరియస్ గా సీనియర్లతో చర్చలు జరుపుతుండటంతో కర్ణాటక మంత్రి వర్గ విస్తరణపై రాహుల్ దృష్టి పెట్టలేదు. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు రాహుల్ ఇటీవలే తీపి కబురు అందించారు. సెప్టంబరు 15వ తేదీ తర్వాత కలుద్దామని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పడంతో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేతలు మంత్రివర్గ జాబితాను రూపొందించే పనిలో పడ్డారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే అన్ని అసంతృప్తి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు.

వచ్చే నెల 15 తర్వాత…..

ఇప్పటికే కర్ణాటక నేతలు పలుమార్లు ఢిల్లీ చూట్టూ ప్రదిక్షిణలు చేసిన కాంగ్రెస్ అసంతృప్త నేతలకు రాహుల్ దర్శనం లభించలేదు. ఆషాఢం ఉందని తొలుత సాకులు చెప్పిన అధిష్టానం ఆషాఢం వెళ్లినా మంత్రి వర్గ విస్తరణ పట్టించుకోకపోవడాన్ని అసంతృప్త నేతలు సీరియస్ గా తీసుకుని మళ్లీ సమావేశాలు ప్రారంభించారు. దీంతో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావులు రాహుల్ ను కలసి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని చూచాయగా చెప్పడంతో సెప్టంబరు 15వ తేదీ తర్వాతరాహుల్ కలసి మాట్లాడేందుకు సమయం ఇచ్చినట్లు సమాచారం.

కుమార ప్రతిపాదనకు…..

ఇదిలా ఉండగా కుమారస్వామి సయితం మంత్రివర్గ విస్తరణగురించే ప్రస్తావించారని తెలియడంతో కాంగ్రెస్ నేతల్లో మళ్లీ జోష్ కన్పిస్తోంది. రాహుల్ విస్తరణకు ఓకే చెప్పనున్నారని, మరో వారం రోజుల్లోనే విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో మళ్లీ ఢిల్లీకి కర్ణాటక కాంగ్రెస్ నేతలు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా అసంతృప్తిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సయితం కుమారస్వామి వందరోజుల పాలనపై కితాబిచ్చారు. పాలన భేషుగ్గా ఉందంటూ పొగిడేశారు. సంకీర్ణంలో ఇరు పార్టీలనూ ఒకరినొకరు గౌరవించుకోవాలని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో కుమారస్వామి సర్కార్ కు ఇప్పట్లో వచ్చే ప్రమాదం ఏదీ లేదని తేలింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*