ఇద్దరి మాట…ఒకటేలా ఉందే….!

ఇద్దరికీ అసలు విషయం తెలుసా…? ఏడాది పాటే ఈ ప్రభుత్వం ఉంటుందని వారికి సంకేతాలు అందాయా? అవును వీరిద్దరి వ్యాఖ్యలను బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అది నిజమేననిపించక మానదు. కర్ణాటక రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి కుమారస్వామి ఏడాది పాటు తన ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. అంటే ఆయన 2019 లోక్ సభ ఎన్నికల వరకూ తాను ముఖ్యమంత్రిగానే ఉంటానని పరోక్షంగా చెప్పారన్నమాట. ఇదే మాటను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంచెం తిరగేసి చెప్పారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల వరకూ కొనసాగదని, పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోవడం ఖాయమన్న సిద్ధూ వ్యాఖ్యలు దేనికి సంకేతాలన్న చర్చ ఇప్పుడు కర్ణాటకలో జరగుతుంది.

నెల గడవక ముందే…

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయి నెల కూడా కాలేదు. కాని అప్పడే సంకీర్ణంలో ముసలం ప్రారంభమయింది. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారో…ఏమో…ఇక్కడ కుమారస్వామిని మాత్రం నిత్యం మాటలలో మానసిక హింసకు కాంగ్రెస్ నేతలు గురిచేస్తున్నారన్నది జేడీఎస్ వర్గాల ఆరోపణ. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య వ్యాఖ్యలు వైరల్ కావడంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ భారీగానే ఏర్పడిందన్నది పరిశీలకుల భావన. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చించనున్నట్లు సమాచారం.

సిద్ధూ మీటింగ్ పై సీరియస్….

సిద్ధరామయ్య దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రితో సిద్ధరామయ్య ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జేడీఎస్ సీరియస్ గా తీసుకుంది. సిద్ధరామయ్య ఎటువంటి సంకేతాలు పంపదలచుకున్నారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి మాత్రమేనని, తమ నేత రాహుల్ ఇచ్చిన హామీతోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టారని వారు వాదిస్తున్నారు. ఇక కుమారస్వామికి మరో సమస్య ప్రారంభమవుతోంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే వచ్చేనెల 5వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతానని కుమారస్వామి ప్రకటించారు.

కాచుకు కూర్చున్న కమలం పార్టీ….

ఇదిలా ఉండగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన జరిగే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవలే అహ్మదాబాద్ లో అమిత్ షాతో బీజేపీ నేత యడ్యూరప్ప సమావేశమయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల గురించే ఈ సమావేశంలో చర్చించామని, ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన లేదని యడ్యూరప్ప చెబుతున్నారు. నెలరోజుల్లోనే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ముదిరిపోయాయని, ఆ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో వారికే తెలియదని చమత్కరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ కూలదోయాల్సిన అవసరం లేదని, దానంతట అదే పడిపోతుందని బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*