కుమారస్వామి కుదురుకోకుండానే?

కేవలం అడుగు దూరంలో అధికారం కోల్పోయిన యడ్యూరప్ప కుమరస్వామిని నిద్రపోనిచ్చేట్లు లేరు. ఆయన కుమారస్వామి ప్రమాణ స్వీకారం నుంచే దూకుడు పెంచారు. కుమారస్వామి రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుంటే సోమవారం బంద్ కు పిలుపునిచ్చారు యడ్యూరప్ప. ఎన్నికల మ్యానిఫేస్టోలో అన్ని పార్టీలు తమ హామీలను ప్రజల ముందుంచాయి. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు విడివిడిగా తమ ఎన్నికల ప్రణాలికలను పోలింగ్ కు ముందే ప్రకటించాయి. అందులో అందరూ ప్రకటించింది రుణమాఫీ. ఈ రుణమాఫీ అంశం ఇప్పుడు కర్ణాటకలో యడ్యూరప్పకు ఆయుధంగా మారింది.

రుణమాఫీపై వత్తిడి…..

ఈ నెల17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప రైతు రుణమాఫీపై తొలి సంతకం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు రావడం, బలనిరూపణ కు సిద్ధమవ్వడం, బలనిరూపణకు ముందే బయటకు వచ్చేయడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కుమరస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని యడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో రుణమాఫీని అమలు చేయడం సాధ్యంకాదన్నది యడ్యూరప్ప అంచనా.

మంత్రివర్గమే ఏర్పాటు కాకుండా…..

అందుకే కుమారస్వామి ప్రభుత్వ పాలన ప్రారంభమైన తొలి రోజునుంచే యడ్యూరప్ప అటాక్ ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీలోగా రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన కుమారస్వామి చేయకుంటే 28వ తేదీన కర్ణాటక బంద్ చేస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. కాని కుమారస్వామి ఇంకా కుదురుకోలేదు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాుటు చేసుకోలేదు. ఆయన మంత్రివర్గ కూర్పు పై కాంగ్రెస్ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు. అవన్నీ సర్దుబాటు అయ్యేసరికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాని ఈలోగానే కుమారస్వామిపై వత్తిడి తేవడమేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

పెద్ద నిర్ణయం కావడంతో…..

కర్ణాటకలో రుణమాఫీ చేస్తే మొత్తం యాభై మూడు వేల కోట్ల రూపాయల భారం ఖజానా పై పడుతుంది. కుమారస్వామి తన ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ చేస్తామని స్పష్టం చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీ చేస్తానని కుమారస్వామి చెప్పడం ఇప్పుడు యడ్యూరప్పకు ఆయుధంగా చిక్కింది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో అంత పెద్ద నిర్ణయాన్ని కుమరస్వామి ఒక్కరే తీసుకోలేరన్నది యడ్యూరప్పకు తెలియంది కాదు. కుమారపై వత్తిడి తేవాలన్న వ్యూహాన్నే యడ్యూరప్ప అనుసరిస్తున్నారు. యడ్యూరప్ప గంటల్లోనే డెడ్ లైన్ విధించడం కూడా సరికాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*