బలపరీక్షలో అనుకోనిది జరుగుతుందా?

crisis in karnataka government

మొన్న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నేడు బలపరీక్షను ఎదుర్కొననున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బలపరీక్షకు సిద్ధమయ్యారు కుమారస్వామి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి కన్నడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. రెండు పార్టీలకు కలిపి అవసరమైన మెజారిటీ ఉన్న అనుమానాలు మాత్రం రెండు పార్టీలనూ వదలడం లేదు.

ఆగ్రహంగా లింగాయత్ లు……

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లింగాయత్ లు కుమారస్వామి పై ఆగ్రహంతో ఉన్నారు. రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని లింగాయత్ లకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించగా కుమారస్వామి అందుకు అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరుగురు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో కుమారస్వామి బలపరీక్ష సమయంలో వీరు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

అసంతృప్తులకు హామీలు….

బలపరీక్ష పూర్తయ్యేంతవరకూ క్యాంప్ ల నుంచి కదలవద్దని రెండు పార్టీలు ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్ట్స్ లోనే ఉన్నారు. ఈరోజు బలపరీక్ష పూర్తయిన తర్వాత వారు తమ ఇళ్లకు వెళ్లనున్నారు. దాదాపు పది రోజుల నుంచి వారు క్యాంపుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్త నేతలందరినీ అధిష్టానం బుజ్జగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడిన నేతలు ఆయనకు కొన్ని హామీలు ఇచ్చినట్లు సమాచారం.

వెయిట్ చేస్తున్న బీజేపీ……

బీజేపీ కూడా కాంగ్రెస్, జేడీఎస్ లలో అసంతృప్తులు బయటపడతాయోమనని కాచుక్కూచుంది. కుమారస్వామి పాలన ఎక్కువ రోజులు సాగదన్న ధీమాతో ఉంది. ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప కుమారస్వామికి బలపరీక్షలో ఇబ్బందులు ఎదురుకావన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలోనూ, వారికి హామీలు ఇవ్వడంలోనూ సక్సెస్ అయ్యారు. అయినా ఏదో జరుగుతుందన్న ఆశతో బీజేపీ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీఎస్ కు 37, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*