నెక్ట్స్ వికెట్ కేవీపీయేనా…??

కె.వి.పి. రామచంద్రరావు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా వేరే చెప్పాల్సిన పనిలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు చదవి, ఆయనతోనే ఉంటూ రాజకీయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన కేవీపీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లైమ్ లైట్ లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా అంతా కేవీపీ చెప్పినట్లే నడిచేదన్నది ప్రతీతి. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శలు చేసేవి. అందుకే వైఎస్ తన ఆప్తమిత్రుడిని వెంటనే కేబినెట్ ర్యాంకు ఉన్న గౌరవసలహాదారుగా నియమించుకున్నారు. తర్వాత ఆయనను రాజ్యసభకు కూడా ఎంపిక చేశారు. వైఎస్ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

కాంగ్రెస్ లోనే కొనసాగుతూ….

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ కాంగ్రెస్ ను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర విభజన సమయంలోనూ ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయంలోనూ రాజ్యసభ లో పోరాటం చేసి ఫోకస్ అయ్యారు. గతకొంతకాలంగా ఆయన పోలవరంపైన కూడా పోరాటం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి పోలవరం వరకూ పాదయాత్ర కూడా చేశారు. అలాంటి కేవీపీకి ఇప్పుడు విషమ పరిస్థితి ఎదురవుతోంది. తన ఆప్తమిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశాబ్దాల కాలం పోరాడిన చంద్రబాబుపై ఆయన ఇప్పటికీ విమర్శలు చేస్తుంటారు. పోలవరంపై ఆయన చంద్రబాబుకు అనేక లేఖలు రాశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలూ….

కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు నేరుగా రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికీ కేవీపీని తమ బాస్ గా భావిస్తుంటారు. ఆర్థికంగా, రాజకీయంగా తమకు అండగా ఉంటారని కేవీపీతో తరచూ సమావేశమవుతుంటారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఇక్కడ నేతలకు కూడా కేవీపీ దూరంగా ఉన్నట్లు సమాచారం.

తర్జన…భర్జన….

ఇక ఏపీ విషయానికొస్తే నిన్న మొన్నటి వరకూ ఏపీ కాంగ్రెస్ లోనూ కీలకంగా వ్యవహరించిన కేవీపీ గత కొద్దిరోజులుగా కన్పించడం లేదు. ఇటీవల రాహుల్ గాంధీ దూతగా అశోక్ గెహ్లాట్ విజయవాడ వచ్చినా ఆయన కన్పించకపోవడంతో ఆ పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీతో జత కట్టడం కేవీపీకి అస్సలు ఇష్టం లేదు. కానీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో తన నిర్ణయంపై ఆయన త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. రాజశేఖర్ రెడ్డిని ద్వేషించే చంద్రబాబుతో పెట్టుకున్న కాంగ్రెస్ లోనే కేవీపీ కొనసాగుతారా? లేక బయటకు వచ్చి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*