ప్ర‌జ‌ల్లోకి జేడీ.. దున్నేస్తారా…‌!

తాజా మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాల‌కే కాకుండా టోట‌ల్ ద‌క్షిణాది రాష్ట్రాల‌కే ప‌రిచ‌య‌మైన సీబీఐ పూర్వపు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ అరంగేట్రం ఖ‌రారైంది. ఆయన వి.వి. లక్ష్మీనారాయణ అయినా జేడీ లక్ష్మీనారాయణగానే సుపరిచితులు.ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయ‌మైన విష‌యం తెలిసిందే. సీబీఐ జేడీ త‌న‌కంటూ భారీ ఇమేజ్‌నుసొంతం చేసుకున్న ఈ హానెస్ట్ ఆఫీస‌ర్‌.. రాష్ట్రంలో జ‌గ‌న్ కేసుల‌తోనూ, ద‌క్షిణాదిలో బ‌ళ్లారి మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని జైలుకు త‌ర‌లించ‌డం ద్వారాను దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయ‌నకు ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలోని పుణే అధికారిగా ఉండ‌గానే ఆయ‌న రాజీనామా చేశారు. మ‌రో ఏడాదిలో దేశంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఆ ఎన్నిక‌ల్లో రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి.

సస్పెన్స్ ను కొనసాగిస్తూనే….

అయితే, ఈ విష‌యంలో జేడీ త‌న స‌స్పెన్స్‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. నిన్న‌నే ఆయ‌న త‌న ఉద్యోగానికి చేసిన రిజైన్‌ను రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు అంగీక‌రించాయి. దీంతో ఇప్పుడు జేడీ స్వేచ్ఛాజీవిగా మారారు. ఈ క్ర‌మంలోనే ఇక‌, ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డం అనే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రో విధంగా కూడా కొంద‌రు చెప్ప‌డాన్ని బ‌ట్టి జేడీ వెనుక బీజేపీ ఉంద‌ని, ఆయ‌న రాజీనామా వెనుక పెద్ద వ్యూహం న‌డుస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ఏపీలో బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి కూడా జేడీని సంప్ర‌దించార‌ని తెలుస్తొంది. జేడీ సిద్ధంగా ఉంటే సీనియార్టీ నిబంధ‌న‌లు, ఆర్ ఎస్ ఎస్ సూత్రాల‌ను సైతం ప‌క్క‌కు పెట్టి తాము ఆ ప‌ద‌విని ఆయ‌నకు క‌ట్ట‌బెట్టేందుకు రెడీగా ఉన్నామ‌ని బీజేపీ అధిష్టానం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. కానీ లక్ష్మీనారాయణ అందుకు సుముఖంగా లేరు. తాను ఏపార్టీలో చేరేది లేదని ప్రకటించారు.

భవిష్యత్ కార్యాచరణను….

అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాల‌పై నోరు విప్ప‌ని జేడీ.. తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే అప్పటిలోగా తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళికను వెల్లడిస్తానన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే సంజీవనిగా భావించే ప్రత్యే క హోదా రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. హోదా వస్తేనే కంపెనీలు ఇక్కడికి తరలివచ్చి రాష్ట్ర యువ తకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

బస్సుయాత్రకు…..

అయితే, విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి అంటే.. జేడీ బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఆయ‌న సొంత‌గా పార్టీ పెట్టే యోచ‌న ఏదీలేదు. అలాగ‌ని ఏపా ర్టీలోనూ చేర‌రు అంటే ఇది వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌గానే భావించాల్సి ఉంటంది. ఇక, జేడీ ప్ర‌త్యేక హోదాకు జైకొట్టారు అంటే.. ప్ర‌త్యేక హోదాను భారీ ఎత్తున తిర‌స్క‌రిస్తున్న బీజేపీకి ఎలా మ‌ద్ద‌తిస్తాడ‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే, ఇప్ప‌టికిప్పుడు ఉన్న స‌మాచారం మేర‌కు యాత్ర‌కు రెడీ అయ్యారు. అంటే అది గ్యారెంటీగా బ‌స్సు యాత్రే అయి ఉంటుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్ల‌ష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో.. జేడీ రాజ‌కీయ ప‌య‌నం ఎటో తెలియాలంటే.. వేచి చూడాలి.

.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*