రేవంత్ రెడ్డి టైం కోసం…??

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్… పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇప్పుడు బిజీగా ఉంది. ఆయన రాక కోసం సీనియర్ కాంగ్రెస్ నేతలు, తలపండిన నాయకులు ఎదురు చూస్తున్నారు. రేవంత్ ను తమ నియోజకవర్గాలకు తీసుకువచ్చి ఓ సభనో, రోడ్ షోనో పెట్టించాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం రేవంత్ టైం కోసం కోరుతున్నారు. అయితే, రేవంత్ మాత్రం ఓ వైపు స్వంత నియోజకవర్గం కొడంగల్ లో ప్రచారం చేసుకోవడం… మరోవైపు ఢిల్లీలో తన వర్గానికి టిక్కెట్ల కోసం ప్రయత్నించడంలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కో నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ వస్తున్నారు.

రేవంత్ ప్రచారం ప్లస్ అవుతుందని…

రాజకీయ ప్రసంగాల్లో రేవంత్ రెడ్డి దిట్ట. మరీ కేసీఆర్ అంత కాకున్నా రేవంత్ రెడ్డి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. పార్లమెంటరీ భాషలోనో అన్ పార్లమెంటరీ భాషలోనో ఆయన జనాలను ఆకర్షించగలరు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆయన మైక్ దొరికితే చాలు రెచ్చిపోయి మాట్లాడతారు. మాటల తూటాలు పేలుస్తారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం కోసం కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే తమకు కొంత ప్లస్ అవుతుందని, ముఖ్యంగా కేడర్ లో జోష్ వస్తుందని వారు భావిస్తున్నారు. ఇలా రేవంత్ టైం కోసం ఎదురుచూసే వారిలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు తక్కువ గానీ వారు, పలుమార్లు మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఉండటం గమనార్హం.

స్టార్ క్యాంపెయినర్ ఉన్నా….

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ బాధ్యతలను ఆశించారు. రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావించారు. అయితే, అనుకున్న పదవి ఆయనకు ఇవ్వలేదు కాంగ్రెస్ అధిష్ఠానం. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టింది. ప్రచార కమిటీని మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రత్యేకంగా వేసింది. దీంతో పాటు విజయశాంతిని మళ్లీ పార్టీలో క్రియాశీలకం చేస్తూ స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు అప్పగించింది. స్టార్ క్యాంపైనర్ తో పాటు ప్రచార కమిటీలోని మల్లు భట్టి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. అయితే, అంతలోనే సీట్ల లొల్లి షురూ కావడంతో ఇతర జిల్లాల్లో వీరి ప్రచార యాత్ర ప్రారంభం కాలేదు.

సీనియర్ల నియోజకవర్గాల్లోనూ…

అయితే, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆయన షబ్బీర్ అలీ తరపున కామారెడ్డిలో, సుదర్శన్ రెడ్డి తరపున బోధన్ లో, సునీతా లక్ష్మారెడ్డి తరపున నర్సాపూర్ లో, గీతారెడ్డి తరపున జహిరాబాద్ లో ప్రచారం నిర్వహించారు. మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారానికి స్పందన కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ లో రేవంత్ జోష్ నింపే ప్రయత్నం చేస్తన్నారు. టీఆర్ఎస్ పెద్దలతో పాటు స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థులను కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక సమస్యలను, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి వివరిస్తున్నారు. గెలుపుపై ధీమాగా నాయకులు మినహా మిగతా వారంతా రేవంత్ రాకకై ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ప్రచార బాధ్యతలు రాకున్నా… ఈ బాధ్యతలను మాత్రం రేవంత్ మోస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*