గెలవడానికి ఎందుకురా…తొందర..?

దేశంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం అలుముకుంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అదే సమయంలో మరో రెండు నెలల్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. వీటి ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనితోపాటు మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. పార్టీల నాయకులు, కార్యకర్తలు అంచనాలు, అవకాశాలు, విశ్లేషణల్లో మునిగి తేలుతున్నారు. లోక్ సభతో పాటు తమ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. లోక్ సభతో పాటు ఎన్నికలకు వెళ్లడం మంచిదా? లేక ముందస్తుగా వెళ్లడం ఉత్తమమా? అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

తెలంగాణలో మాత్రం…..

ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమైన తెలంగాణలో ఈ విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు సిద్థంగా ఉన్నట్లు పార్టీ యంత్రాంగానికి ఆమేరకే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. నవంబరు, డిసెంబరు లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాంలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరపాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అందుకోసమే ‘‘ప్రగతి నివేదన సభ’’ పేరుతో హడావిడి చేశారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కే్ంద్ర ప్రభుత్వ ప్రచారం తమపై పడుతుందన్నది ఆయన అనుమానం. అదే సమయంలో రెండు ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించలేమన్నది కూడా కేసీఆర్ ఆలోచన. అసెంబ్లీ, లోక్ సభకు విడివిడిగా ఎన్నికలు జరిపితే పూర్తిగా దృష్టి పెట్టవచ్చన్నది కేసీఆర్ మనోగతంగా చెబుతున్నారు. ముందస్తు ద్వారా విపక్షాలను గుక్కతిప్పుకోనీయకుండా చేయాలన్నది అసలు వ్యూహం. ముందస్తు ఎన్నికల్లో గెలిస్తే దాని ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతోంది. ఆ ఎన్నికల్లో నల్లేరుపై నడకేనన్నది గులాబీ దళ పతి అంచనా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని విపక్ష కాంగ్రెస కూడా పరిస్థితులను గమనిస్తోంది. తన వంతు ఏర్పాట్లను చేసుకుంటోంది. అయితే కేసీఆర్ ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రచారాన్ని అధిగమించడం హస్తం పార్టీకి అంత తేలికేమీ కాదు. ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది.

బాబుకు ముందస్తు అంటే…..

లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఏమాత్రం తొందరపడటం లేదు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడిన విషయం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా గుర్తు. నాడు తిరుపతిలో ఆయనపై నక్సలైట్ల హత్యాయత్నం చేసినప్పుడు సానుభూతితో ఎన్నికల గండం గట్టెక్కవచ్చని భావించారు. ఆ ఉద్దేశ్యంతో ఎన్నికలకు వెళ్లి చేదు అనుభవాన్ని చవిచూశారు. ఇప్పుడు మూడు పార్టీలు (వైసీపీ, బీజేపీ, జనసేన) నుంచి పోటీ ఎదుర్కొంటున్న చంద్రబాబు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఎన్నికలకు తొందర పడటం లేదు. పార్టీ అధినేత జగన్ పాదయాత్ర పూర్తి కావడంపైనే ప్రస్తుతం దృష్టి సారించింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. బీజేపీ, జనసేన ఇతర చిన్నా చితకా పార్టీల పరిస్థితి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

నవీన్ నింపాదిగా…….

సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మరో పెద్ద రాష్ట్రం ఒడిశా. బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుగా ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేయడం లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలకు గాను 20 సీట్లను , గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ఆయన తిరుగులేని ధీమాతో ఉన్నారు. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ఆ పార్టీని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నించడం లేదు. దీంతో నవీన్ పట్నాయక్ కు ఎదురేలేని పరిస్థితి. విపక్ష కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని గద్దె దించడ కాదు కదా గట్టి పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేదు. పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కిశోర్ దాస్, చిరంజీవ్ బిశ్వాల్, సీఎల్పీనాయకుడు నర సింగ్ మిశ్రా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ లకు ప్రజాబాహుళ్యంలో పట్టు లేదు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి జితేంద్ర సింగ్ ప్రభావం శూన్యం. ఒడిశాకు చెందిన రామచంద్ర కుంతియా ప్రస్తుతం తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జి.

అరుణాచల్ , సిక్కింలోనూ…..

లోక్ సభతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన మరో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. 60 మంది సభ్యులుగల రాష్ట్రంలో 2014లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో సహా మొత్తం బీజేపీలోకి ప్లేటు ఫిరాయించింది. రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలలో అరుణాచల్ ప్రదేశ్ తూర్పు స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నుంచి బీజేపీ తరుపున ఎన్నికైన కిరణ్ రిజిజు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. లోక్ సభతో పాటు ఎన్నికలు జరగాల్సిన మరో రాష్ట్రం సిక్కిం. ఇది చాలా చిన్న రాష్ట్రం. 32 స్థానాలు గల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సారథ్యంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ 1996 నుంచి గెలుస్తూ వస్తోంది. ఈసారి కూడా చామ్లింగ్ విజయం ఖాయం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ తదితర జాతీయ పార్టీలకు చోటే లేదు. మొత్తం మీద ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు తొందరపడటం లేదు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*