మక్కా మసీదు కేసు కొలిక్కి వస్తుందా?

మక్కా పేలుళ్ల కేసు కొలిక్కి వచ్చింది. ఈనెల 16న తీర్పు వెలవరించేందుకు నాంపల్లి కోర్టు అన్ని విధాలుగా రెడీ చేసుకుంది. పదకొండేళ్ల తర్వాత రాబోతున్న తీర్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలా వచ్చినా నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మరకలు వెంటాడుతూనే….

మక్కా మసీదులో పేలుళ్ల మరకలు పదేళ్ల నుంచి నగరాన్ని వెంటాడుతునే ఉన్నాయి. 2007 మే 18న మధ్యాహ్నం 1.18 గంటలకు బాంబు పేలింది. సెల్‌ఫోన్‌ సాయంతో మక్కామసీదులో పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 14 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. 58 మంది గాయాలపాలయ్యారు. గుంపులు గా ఉన్న జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపినట్లు అప్పటి అధికారులు తెలుపుతున్నారు. అత్యంత శక్తిమంతమైన ఐఈడీ ని ఉపయోగించారు. దాన్ని ఒక బరువైన పాల రాతి కింద పెట్టారు. అది చాలావరకు పేలుడు తీవ్రతను ఆపింది గానీ, లేకపోతే దాదాపు 10 వేల మంది వరకు ప్రార్థన చేస్తున్న సమయంలో పేలితే ఈ బాంబు ఎన్ని వందల మంది ప్రాణాలు తీసేదోనని పోలీసులు చెబుతున్నారు. అప్పటికి వుజుఖానా వద్ద పేలుడు సంభవించిన తర్వాత మరో రెండు ఐఈడీలను పోలీసులు గుర్తించి వెంటనే నిర్వీర్యం చేశారు. ఆర్‌డీఎక్స్‌, టీఎన్‌టీలను 60:40 నిష్పత్తిలో కలిపి చేసిన సైక్లోటాల్‌ అనే ఐఈడీని 10/3 అంగుళాల పైపులో అమర్చారు.

ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత…..

ఇక కేసు దర్యాప్తులో సిట్ బృందం నానా తంటాలు పడిందనే చెప్పవచ్చు. నిందితులలో ఒకరైన లోకేశ్‌ శర్మ అరెస్టయ్యాడు. అతడితోపాటు.. 2008 నాటి మాలెగావ్‌ పేలుళ్ల నిందితుడు దేవేందర్‌ గుప్తాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కానీ, లోకేశ్‌ శర్మతో పాటు మాలెగావ్‌ పేలుళ్లలో నిందితు రాలైన ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, మరో నలుగురిపై ఆరోపణలను ఎన్‌ఐఏ గత ఏడాది ఉపసంహరిం చుకుంది. మక్కామసీదులో బాంబులు పెట్టినది లష్కరే తోయిబా లేదా హర్కతుల్‌ జీహాద్‌ అల్‌ ఇస్లామీ (హుజి) లాంటి ఉగ్రవాద సంస్థలు అయి ఉంటా యని తొలుత భావించారు. హైదరాబాద్‌కు చెందిన హుజి కమాండర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ షాహిద్‌ పాకిస్థాన్‌ లేదా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ ఉగ్ర వాద దాడి చేసి ఉంటాడని అంచనా వేశారు. అతడు పాకిస్థాన్‌లో హత్యకు గురి కావడంతో అతడి పాత్రలేదని తేలిపోయింది. మక్కా మసీదు పేలుళ్ల కేసుపై 2010 డిసెంబర్‌ల సీబీఐ గుప్తా, శర్మలపై చార్జిషీటు దాఖలుచేసింది. అజ్మీర్‌ దర్గా పేలుళ్ల కేసులో కూడా వీళ్లిద్దరి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. వారితో పాటు మరో నలుగురి పేర్లను సీబీఐ కేసులో పేర్కొంది. తర్వాత ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు. 2011 మే నెలలో ఎన్‌ఐఏ అధికారులు నవకుమార్‌ సర్కార్‌ అలియాస్‌ స్వామి అసిమానందపై చార్జిషీటు దాఖలుచేశారు. 226 మంది సాక్షులకు గాను 60 సాక్షులను మాత్రమే నాంపల్లి కోర్టు విచారించినట్లు సమాచారం. 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసును చకచకా ఛేదించిన ఎన్‌ఐఏ నిందితులకు ఉరిశిక్షపడేలా వ్యవహరించింది. కాని మక్కా బ్లాస్ట్ కేసులో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేందర్‌ గుప్తాతో పాటు 2013 జూన్‌ 28 న్యాయస్థానంలో సప్లిమెంటరీ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది ఎన్.ఐ.ఏ. సప్లమెంటరీ చార్జీషీట్ లో దేవేందర్‌గుప్తా(ఏ1), లోకేష్‌శర్మ(ఏ2), సందీప్‌డాంగే (ఏ3), రామచంద్ర కళాసంగ్రా (ఏ4), సుని ల్‌ జోషి (ఏ5), స్వామి అసిమానంద(ఏ6), భరత భాయి (ఏ7), రాజేందర్‌ చౌదరి(ఏ8), తేజ్‌రామ్‌ పరమార్‌(ఏ9), అమితచౌహాన్‌ (ఏ10)లుగా పేర్కొంది. అభినవ్‌ భారత సంస్థ నేతలు దేవేందర్‌గుప్తా, స్వామి అసిమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్రపన్నారు. దేశంలోని హిందూ దేవాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు బుద్దిచెప్పటమే వీరి లక్ష్యమని అభియోగ పత్రాల్లో ఎన్.ఐ.ఏ గుర్తించింది.

బాంబులకు బాంబులతోనే సమాధానం చెప్పాలంటూ….

1999 – 2006 మధ్య సంస్థ సభ్యులంతా పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. 2004లో ఉజ్జయిని కుంభమేళా, 2005, 2006 సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘బాంబ్‌ కా జవాబ్‌ బాంబ్‌ సే దేనా హై’’నా అంటూ బాంబు పేలుళ్ల వ్యూహానికి పదునుపెట్టారని ఎన్.ఐ.ఏ. తెల్చింది. 2005లో జైపూర్‌లోని గుజరాతి ధర్మశాలలో నకిలీ చిరునామాతో బస చేశారు. ముస్లింలు అత్యథికంగా నివసించే ప్రాంతాల్లో బాంబులు పేల్చేందుకు వీలుగా పథకనచన చేశారు. 2006 జనవరి 4న రామచంద్ర, సునిల్‌జోషి మధ్యప్రదేశ్‌లో బాగ్లి ప్రాంతంలో బాంబుల తయారీ, పేల్చటంపై శిక్షణ తీసుకున్నారు. అదే నెల 16వ తేదీ హర్యానాలో ఫైరింగ్‌ చేయటంలో సాధన చేశారు. 2006లో ఏ4 నిందితుడు రామచంద్ర కళాసంగ్రా భోపాల్‌ నుంచి పేలుడు సామాగ్రి తెప్పించాడు. ఇండో ర్‌లోని మన్వత్ నగర్‌లో మొబైల్‌ఫోన్ల ద్వారా బాంబులు అమర్చటాన్ని ప్రాక్టీస్‌ చేశారు. 2006లో హైదరాబాద్‌ లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం భరతభాయి రూ. 40,000 నగదు సునిల్‌జోషికి అందజేశాడు. సందీప్‌డాంగే నకిలీ అడ్రస్‌లతో వేర్వేరు ప్రాంతాల్లో మొబైల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, పిస్టల్‌ కొనుగోలుచేశాడు. మక్కా మసీదులో పేలుడు జరిపేందుకు తేజ్‌రామ్‌ పరమార్‌, రాజేందర్‌ చౌదరి రెక్కీ నిర్వహించారు. 2007 మే 17 వీరిద్దరూ మారుతివ్యాన్‌లో ఇండోర్‌ నుంచి భోపాల్‌ రైల్వేస్టేషన్‌ చేరారు. అక్కడ రాంజీకి పేలు డు పదార్ధాల (ఐఈడీ )ను రాంజీ అనే వ్యక్తి వీరికి అంద జేశాడు. 400 ఏళ్లనాటి రాతి కింద పేలుడు పదార్థాలు ఉంచారు. మధ్యాహ్నం 1.18 నిమిషాల సమయంలో రెండు మొబైల్‌ బాంబులను పేల్చారు. మరో బాంబును బాంబుస్క్వాడ్‌ గుర్తించి నిర్వీర్యం చేసిందని చార్జీషీట్ లో ఎన్.ఐ.ఏ తెలుపుతూ సాక్షాదారాలతో సహా కోర్టుకు సమర్పించారు.

కేసులో కొందరు మరణించినా….

అయితే భరత్ మోహన్‌లాల్‌, రాజేందర్‌ చౌదరి సంఝౌతాఎక్స్‌ ప్రెస్‌ పేలుడు కేసులో ప్రస్తుతం హర్యానాలోని అంబా లా జైల్లో ఉన్నారు. తేజ్‌రామ్‌ పరమార్‌ అలియాస్‌ ఖలిపా బెయిల్‌పై విడుదలయ్యాడు. సునీల్‌జోషి జైల్లో ఉండగానే అనుమాస్పదస్థితిలో మరణించాడు. అమిత్‌చౌహాన్‌, దేవేందర్‌గుప్తా, స్వామి అసిమానంద, భరతభాయి, లోకేశ్‌శర్మ పరారీలో ఉన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. మాలెగావ్‌ బాంబుపేలుళ్లకు కారకుడైన అసిమానంద స్వామిరామచందర్‌, అమితచౌహాన్‌లతో కలసి మక్కా మసీదులో బాంబులు అమర్చి పేలుడు జరిపినట్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) న్యాయస్థానానికి అందజేసిన అభియోగపత్రాల్లో వివరించింది. భరత్‌ మోహన్‌లాల్‌ రితేశ్వర్‌ అలియాస్‌ భరత్‌ భాయ్, స్వామి అశిమానందలకు నాంపల్లి కోర్టు ఏడాది క్రితమే బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మోస్టు వాంటెడ్‌ నిందితులుగా ఉన్న రామ్‌చంద్ర కస్సంగ్రా, సందీప్‌ ధాంగే మరణించారా… అనే అనుమానాలు తావిస్తున్నాయి. ; మక్కా మసీదు పేలుళ్ల తర్వాత 70 మంది ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారనే అపవాదం ఉంది. అందుకు 2011లో అప్పటి ప్రభుత్వం యువకులకు నష్టపరిహారం చెల్లించింది. 2013లో ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. నష్టపరిహారం కోసం ఫిర్యాదుదారులు సివిల్ కేసు దాఖలు చేసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. జాతీయ మైనారిటీ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 50 మంది ముస్లిం యువకులకు 20 వేల రూపాయల చొప్పున, 20 మందికి 3 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించింది.11 సంవత్సరాల పాటు కోనసాగిన ఈ కేసులో సోమవారం ఎన్.ఐ.ఏ. కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

-స్పెషల్ రిపోర్ట్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*