మధు యాష్కి ఇక చేతులెత్తేసినట్లేనా..?

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొంటూనే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తెలంగాణ ఏర్పాటు కోసం ఓప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. 2009 నుంచి 2014 వరకు ఆయన ఇంచుమించు రాష్ట్ర మీడియాలో వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే, 2014 ఎన్నికలతో ఆయన రాజకీయ పయనం మారిపోయింది. తెలంగాణ కోసం పోరాడిన ఇమేజ్ ఉన్న మధు యాష్కి ఆ ఎన్నికల్లోనూ గెలిచి కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారని అంతా భావించినా, సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ తరపున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితనే పోటీ చేయడంతో మధు యాష్కికి ఓటమి తప్పలేదు. సుమారు లక్షా యాభై వేల ఓట్ల తేడాతో కవిత చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్ గా మారిపోయారు. నియోజకవర్గానికి కూడా ఎప్పుడో అన్నట్లుగా తప్పితే పర్యటించింది లేదు.

జాతీయ స్థాయిలోనే…

ఇదే సందర్భంలో జాతీయ రాజకీయాల్లో మధుయాష్కి కీలకపాత్ర పోషిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినా ఢిల్లీ యూనివర్సిటీలో లా చదవడం, అమెరికాలో లా ఫర్మ్ నిర్వహించిన ఆయన టాలెంట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. దీంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో చోటు ఇచ్చి అధికార ప్రతినిధిగా నియమించింది. దీంతో అప్పటి నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగై కేవలం జాతీయ రాజకీయాల్లో కనపడుతున్నారు. జాతీయ మీడియాలో చర్చా వేదికల్లో పాల్గొనడం, వివిధ అంశాల్లో పార్టీ స్టాండ్ ను తెలియజేయం చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ అద్యక్షులు రాహుల్ గాంధీ కోటరీలో ఒకరిగా మారి ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకంగా పని చేశారు. ఎంత జాతీయ రాజకీయాల్లో ఉన్నా రాష్ట్రంలో అందునా నియోజకవర్గంలో బలంగా లేకపోతే వృధానే. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి, అందునా కవితపై గెలవడం అంటే మామూలు విషయం కాదు. మరి, ఈ విషయం మధు యాష్కీకి తెలియక కాదు. కానీ, ఆయన మనస్సులో ఏమి ఆలోచన ఉందో క్యాడర్ కు మాత్రం అంతుచిక్కడం లేదు.

అసలు పోటీ చేస్తారా..? లేదా..?

టీఆర్ఎస్ నుంచి కవితకు పోటీ బీజేపీ బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో నిలవడం ఖాయంగా కనపడుతోంది. దీంతో ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లిపోతున్నారు. బీజేపీ అభ్యర్థి అంత దూకుడుగా పోతుంటే కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం కనపడకపోవడం ఆశ్చర్యంగా మారింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని, మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయనుకుంటున్న తరుణంలోనూ మధు యాష్కి నియోజకవర్గంలో తిరగకపోవడం క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది.

రాష్ట్ర రాజకీయాలకు దూరంగా…..

అసలు వచ్చే ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారా లేదా ఇంకేదైనా స్థానంపై కన్నెశారా లేకపోతే అసలు పోటీనే చేయరా? అనేది సస్పెన్స్ గా మారింది. అధిష్ఠానానికి దగ్గరగా మారిన ఆయన ఎంపీగా గెలిచి, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి స్థానంలో ఉండే అవకాశం ఉందని, కానీ తమ నేత మాత్రం ఇలా చేస్తున్నారేంటని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారు. రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ సమావేశాలకూ ఆయన దూరంగానే ఉంటున్నారు. గాంధీభవన్ కు రావడం అరుదుగా మారింది. అయితే, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర దక్షిణాదిన అంతోఇంతో ఆశ ఉన్న ఈ రాష్ట్రమే. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలిస్తే వారికి ఎంతో మేలు. ఇటువంటి సందర్భంలోనూ ఆ పార్టీ ఒక ఎంపీ స్థానాన్ని లైట్ తీసుకోవడం ఎంటోనని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*