ఈసారి బొమ్మ తిరగబడేనా…?

మరో రెండు నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి మధ్యప్రదేశ్ పైనే కేంద్రీకృతమై ఉంది. 230 స్థానాలతో మధ్య భారతంలో విస్తరించిన ఈ రాష్ట్రం అతి పెద్దది కావడమే ఇందుకు కారణం. రాజస్థాన్ (200) తెలంగాణ (119), ఛత్తీస్ ఘడ్ (90), మిజోరాం (40) రాష్ట్రాలు చిన్నవి కావడంతో అన్ని పార్టీలకూ మధ్యప్రదేశ్ కీలకంగా మారింది. అసెంబ్లీ స్థానాల పరంగా మధ్యప్రదేశ్ నాలుగో అతి పెద్ద రాష్ట్రం. 403 స్థానాలతో ఉత్తరప్రదేశ్ ప్రధమ స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 288 స్థానాలతో ద్వితీయ, బీహార్ 243 స్థానాలతో తృతీయ స్థానాల్లో ఉన్నాయి. 230 స్థానాలతో బీహార్ నాలుగో అతి పెద్ద రాష్ట్రంగా నిలిచింది. అందువల్లే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో అన్నింటికన్నా మధ్యప్రదేశ్ పైనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు దఫాలుగా బీజేపీ ఇక్కడ అధికారంలో ఉండటం, ముఖ్యంగా 2005 నుంచి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ చక్రం తిప్పుతుండటం ఆసక్తికరం. ఈపెద్ద రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడం కమలం పార్టీకి కత్తిమీద సాములాగా మారగా, అధికారాన్ని చేజిక్కించుకోవడం హస్తం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అందువల్లే ప్రధాన జాతీయ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. ఎత్తులు, పైఎత్తులతో తలమునక లవుతున్నాయి. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

ముందుగానే సమాయత్తం…….

అధికార భారతీయ జనతా పార్టీ ఒకింత ముందుగానే సమాయత్తమైంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే దిశగా ఇండోర్ లో ఒక రోజంతా గడిపారు. ఈ ప్రాంతంలో ప్రాబల్యమున్న బోహ్రా తెగ ముస్లింలతో సమావేశమయ్యారు. షియా ముస్లింలలో వీరు ఒక తెగ. వ్యాపార రంగంలో వీరు బాగా విస్తరించారు. ఈ సందర్భంగా బోహ్రా తెగ ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడు సైఫుద్దీన్ ను సత్కరించారు. స్వాతంత్ర్య సమరంలో బోహ్రా తెగ ముస్లింల సేవలను, పాత్రను కొనియాడారు. ఇండోర్ లోని సైనీ మసీదులో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో బోహ్రా తెగ ముస్లింలు పాత్రను ప్రస్తుతించారు. మహాత్మాగాంధీతో కూడా వీరికి మంచి సంబంధాలున్నాయని ప్రస్తావించారు. తన ఇండోర్ పర్యటన ద్వారా ముస్లింలకు బీజేపీ దూరమన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు మోదీ ప్రయత్నించారు. మొత్తం ముస్లిం సమాజాన్ని ఒక వర్గంగా కాకుండా వారిలో అంతర్గతంగా ఉన్న చిన్న,చిన్న తెగలను ఆకట్టుకుని లబ్ది పొందాలన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ముస్లిం ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీకి పడేవి. ముస్లిం సమాజంలో వర్గాలు, తెగలతో సంబంధం లేకుండా అందరూ ఆ పార్టీకి అండగా నిలబడే వారు. మోదీ ప్రయత్నంతో కొంతైనా మారప్ు వస్తుందన్న ఆశాభావం భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

దీనిపైనే ఆశలు…..

ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో రాజస్థాన్ పై బీజేపీకి పెద్దగా ఆశల్లేవు. అక్కడ రెండోసారి అధికార పార్టీ విజయం సాధించలేక పోవడం ఆనవాయితీగా వస్తుంది. 2013లోనే ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. చిన్న రాష్ట్రమైన మిజోరాం ప్రాధాన్యం పరిమితం. తెలంగాణ పై అసలు ఆశలే లేవు. ఇక్కడ ఉనికిని కాపాడుకోవడమే కమలనాధుల ముందున్న సవాల్. దీంతో కమలం పార్టీ మధ్యప్రదేశ్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. 230 స్థానాలున్న రాష్ట్రంలో 2013 ఎన్నికల్లో 165 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ 58 స్థానాలతో సరిపెట్టుకుంది. బీఎస్పీ 4, స్వతంత్రులు 3 స్థానాలను సాధించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ కమలం పార్టీ కదం తొక్కింది. మొత్తం 29 లోక్ సభ స్థానాలకు గాను 27 స్థానాలను దక్కించుకుని పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ కేవలం రెండుచోట్ల గెలిచింది. ప్రజాదరణ కలిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జ్యోతిరాదిత్య సింథియా (గుణ నియోజకవర్గం), కమల్ నాధ్ (చింద్వారా) లు మాత్రమే విజేతలుగా నిలిచారు. గత ఫలితాల ప్రాతిపదికన చూస్తే కమలందే పై చేయిగా కనపడుతోంది. కానీ ఈ నాలుగున్నరేళ్లలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కమలం పరిస్థితి మసక బారుతుండగా, కాంగ్రెస్ కొంతవరకూ పుంజుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

నిలదొక్కుకుంటున్న హస్తం……

ముంగోలి, కొలారస్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజేతగా నిలబడడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా కలసి కట్టుగా ముందుకు సాగుతున్నాయి. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, ప్రజల్లో పట్టున్న గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింథియా, సీనియర్ నాయకుడు కమలనాధ్ ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. కమలాన్ని గద్దె దించేందుకు ఇంతకు మించి సరైనా సమయం దొరకదన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా వయసు పైబడిన దిగ్విజయ్ సింగ్ నర్మదానదీ పరివాహక ప్రాంతంలో ‘‘నర్మద పరివర్తన్ యాత్ర’’ పేరుతో పాదయాత్ర చేశారు. ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ పాత్ర పరిమితమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సర్వే ఫలితాల నేపథ్యంలో పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింథియా, కమలనాధ్ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ఈ ఇద్దరూ గతంలో సీఎంలుగా పనిచేయలేదు. గతంలో దిగ్విజయ్ సింగ్ సీఎంగా పనిచేశారు. అయితే ప్రస్తుతానికి సీఎం పదవికి పేరు ప్రతిపాదించబోమని, ఫలితాల అనంతరం పార్టీ నిర్ణయింస్తుందని రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు సంజయ్ కపూర్ స్పష్టం చేశారు.

చౌహాన్ పైనే భారం……

జాతీయ స్థాయి నాయకులను మినహాయిస్తే అధికార భారతీయ జనతా పార్టీ పూర్తిగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పైనే ఆధారపడింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాకేశ్ సింగ్ వంటి వారున్నప్పటికీ 2005 నుంచి వరుసగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చౌహాన్ పైనే పార్టీని గెలిపించిన బాధ్యత ఉంది. 1959 మార్చి 5న జన్మించిన చౌహాన్ రాష్ట్రానికి 18వ ముఖ్యమంత్రి. స్వతహాగా సౌమ్యుడైన చౌహాన్ పాలనా కాలం ప్రశాంతంగానే గడిచింది. కానీ ‘‘వ్యాపం’’ కుంభకోణం వ్యక్తిగతంతా ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వ లేమి పెద్దలోటుగా ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వంపై గల అసంతృప్తి తమ కొంపముంచుతుందన్న ఆందోళన కమలనాధుల్లో కనపడుతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ఎంతో కొంత ప్రభావం చూపుతాయన్నది అంతర్గతంగా పార్టీ విశ్లేషణ. ఏది ఏమైనా ఈసారి భోపాల్ కోటను కాపాడుకోవడం అంత తేలిక కాదన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అదే సమయంలో భవిష్యత్తు పై హస్తం పార్టీ ఎంతో ఆశాభావంతో ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సిందే.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*