మహాకూటమి వచ్చేస్తుందా …?

మహా కూటమి ఈ మాటను 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విన్నాం. ఇప్పుడు విభజన తరువాత ఏపీలో అలాంటి కూటమి ఒకటి ఏర్పడబోతోంది. నాడు వైఎస్ టార్గెట్ గా టిడిపి, టీఆరెస్, సిపిఐ, సిపిఎం, అన్ని కలిసి రంగంలోకి దిగాయి. ఏపీలో కాంగ్రెస్ ను ఓడించడమే ఆ కూటమి లక్ష్యం. ఇప్పుడు అటు టిడిపి ఇటు వైసిపి, బిజెపి టార్గెట్ గా ఏపీలో కొత్త కూటమికి శ్రీకారం చుట్టేందుకు కామ్రేడ్ లు రంగంలోకి దిగిపోయారు. అయితే ఈ కూటమి కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ కార్యాచరణ మొదలు పెట్టేశారు.

సరికొత్త ప్రత్యామ్నాయ వేదిక అంటున్న సిపిఐ …

సిపిఐ, సిపిఎం పార్టీలకు ఎపి అసెంబ్లీలో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్ట్ లకు ఎంతోకొంత ప్రాతినిధ్యం ఉండేది. ఏపీలో ఇప్పుడు టిడిపి, వైసిపి, బిజెపి లు మాత్రమే అసెంబ్లీలో గత ఎన్నికల్లో గెలిచి అడుగుపెట్టాయి. ఇప్పుడు చిల్లర మల్లర గా ఓట్లు చెదిరిపోకుండా సిపిఐ, సిపిఎం కలిసి జనసేన, కాంగ్రెస్ లోక్ సత్తా లను కలుపుకుని అధికారపార్టీకి అసలైన ప్రత్యామ్నాయం తామే అనే స్లోగన్ తో సాగేందుకు ఒక వ్యూహం పక్కాగా తయారు చేస్తున్నాయి. ఈ వ్యూహాన్ని అమలు చేసే క్రమంలో చర్చలు మొదలైపోయాయి. పార్టీల నేతలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను ఈ కూటమికి మద్దతు ప్రకటించేలా ఒప్పించేందుకు కామ్రేడ్ లు కసరత్తు చేస్తున్నారు.

మాజీ ఎంపీలతో రామకృష్ణ భేటీ …

సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అమలాపురం మాజీ ఎంపి జివి హర్ష కుమార్, రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ లతో భేటీ అయ్యారు. వీరిద్దరితో చెరో గంట వారి ఇంటి వద్ద రహస్య మంతనాలు జరపడం చర్చనీయాంశం అయ్యింది. హర్ష కుమార్ ఇంటికి వ్యక్తిగత పనులపై హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపి వి. హనుమంత రావు కూడా చర్చల్లో పాల్గొన్నారు. మాజీ ఎంపిలతో భేటీ అనంతరం తాను విజయవాడ, రాజమండ్రిలలో తలపెట్టిన కార్యక్రమాలకు ఆహ్వానం పలికేందుకు వచ్చానని రామకృష్ణ వెల్లడించారు. అమరావతిలో సదస్సు, రాజమండ్రిలో దళిత సదస్సులను నిర్వహించే క్రమం లోనే ఈ చర్చ లు అన్నారు ఆయన.

కాంగ్రెస్ తో జనసేన జట్టు కడుతుందా …?

ఏపీలో పూర్తిస్థాయిలో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ అని ప్రకటించిన జనసేన కాంగ్రెస్ తో జత కట్టే పరిస్థితి ఎంతవరకు ఉంటుందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో బయల్దేరింది. కాంగ్రెస్, లోక్ సత్తా, సిపిఐ, సిపిఎం నాలుగు పార్టీలు కలిస్తే ఎవరు ఎన్ని స్థానాలకు బరిలోకి దిగుతారు అన్న ఆసక్తి మొదలైంది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఘోరమైన పద్దతిలో చేసిందన్న జనసేన ఆ పార్టీతో జతకడితే ప్రజలు ఎంతవరకు వీరిని ఆమోదిస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. విభజన పాపం కాంగ్రెస్ ది ఎంతుందో…? బీజేపీ దీ అంతే ఉందన్న నమ్మకం జనంలో పాతుకుపోయింది. టిడిపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి బిజెపి ని తూర్పారబడుతున్న నేపథ్యంలో కమల వికాసం మరింత మసకబారింది. ఈ నేపథ్యంలో జనం కాంగ్రెస్ ను తిరిగి విశ్వసించే పరిస్థితి ఏర్పడుతుందా..? పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై ద్వేషాన్ని కోపాన్ని ప్రజల్లో చల్లార్చగలరా ? ఇవన్నీ ప్రశ్నలు గా ఉదయిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*