త్యాగరాజులం కాదు…మరీ అన్ని సీట్లా?

తెలంగాణ రాష్ట్ర సమితిని ధీటుగా ఎదుర్కొనాలంటే మహాకూటమి ఏర్పాటుచేయక తప్పదు. మహాకూటమి ఏర్పాటు కావాలంటే భారత జాతీయ కాంగ్రెస్ కొన్ని సీట్లు త్యాగం చేయక తప్పదు. మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఐ, తెలంగాణ జన సమితి ఉండాలన్నది వారి ఆలోచన. ఈ నాలుగు పార్టీలు కలిస్తే కేసీఆర్ ను ఢీకొట్టడం ఈజీ అని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం ఇదే సూత్రాన్ని పార్టీ నేతలకు చెప్పారు. కలసి పోటీ చేస్తేనే కేసీఆర్ కు చుక్కలు చూపించవచ్చని అన్ని పార్టీల నేతలూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

పొత్తులు వద్దంటూ…..

కాని సీట్ల సంగతేంటి? మహాకూటమి ఏర్పడాలంటే ముందుగా సీట్ల సంగతి తేల్చాల్సిందే. అది తేలితే కాని మహాకూటమి ఏర్పాటు అవుతుందా? లేదా? అన్నది స్పష్టత రాదు. తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బాధ్యులన్నారు. వీరు కొంతకాలంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలో పోటీ చేయాలన్న ఆశతో చేతి చమురును కూడా వదిలించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి పొత్తులు వద్దంటూ విన్నపాలు కూడా పీసీసీకి అందాయి. అయితే హైకమాండ్ నిర్ణయం మేరకే పొత్తులు కుదుర్చుకుంటున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తేల్చేశారు.

మిత్రులు అడిగేవి 67 స్థానాలు…..

పొత్తులపై వివిధ పార్టీలతో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ 30, తెలంగాణ జనసమితి 30, సీపీఐ ఏడు స్థానాలు కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జనసమితికి ఇంకా క్షేత్రస్థాయిలో నేతలు లేకున్నా కోదండరామ్ కు ఉన్న ఇమేజ్ కారణంగానే ఆ పార్టీ అన్ని సీట్లు డిమాండ్ చేశారు. ఇక టీడీపీ కూడా తమకు 30 స్థానాలు కేటాయించాల్సిందేనని గట్టిగా కోరుతుంది. మిత్రపక్షాలకు 67 స్థానాలు కేటాయిస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి మిగిలేది 52 స్థానాలే. అయితే కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలకు అంగీకరించదని వారికీ తెలియంది కాదు. కాంగ్రెస్ మాత్రం మిత్ర పక్షాలన్నింటికీ కలిపి 30 స్థానాల వరకూ ఇచ్చేందుకు సిద్ధమయినట్లు సమాచారం.

కీలక సీట్లు కూడా……

సీట్ల సంఖ్య మాత్రమే కాకుండా కొన్ని కీలక సీట్లపై కూడా మిత్రులు కన్నేయడం హస్తం పార్టీకి ఇబ్బందిగా మారింది. వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కోరుతోంది. అయితే నర్సంపేటలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. పరకాల సీటు కొండా ఫ్యామిలీకి రిజర్వ్ అయిందంటున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని తెలంగాణ జనసమితి కోరుతోంది. అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాల సీటును టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ కోరుతున్నారు. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి, దేవరకద్రలను టీడీపీ కోరుతోంది. అక్కడ వనపర్తి ఎమ్మెల్యేగా చిన్నారెడ్డి ఉన్నారు. ఇలా మిత్రులు కోరే ప్రతి సీటూ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పరచేవిగానే ఉన్నాయి. అన్ని సీట్లు త్యాగం చేయడం తమవల్ల కాదంటున్నారు హస్తం పార్టీ నేతలు. మొత్తం మీద మహాకూటమి ఏర్పాటు సాధ్యమవుతుందని భావిస్తున్నా సీట్ల పంపకంలో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితులే ఉన్నాయి.