ఆ బ‌ల‌మైన లీడ‌ర్ కోసం వైసీపీ వ‌ల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బ‌లంగా ఫిక్స్ అయిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు గెలుపు కీల‌కం. 2019లో ఎన్నిక‌లు ఆయ‌న‌కు చావో రేవో లాంటివి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జా సంకల్ప యాత్ర చేస్తోన్న జ‌గ‌న్ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం ముమ్మ‌ర అన్వేష‌ణ చేయ‌డంతో పాటు తాను ఒక మెట్టు కింద‌కు దిగి అయినా కొంద‌రిని పార్టీలోకి స్వ‌యంగా ఆహ్వానిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఓ మాజీ మంత్రిని సైతం జ‌గ‌న్ ఫోన్ చేసి స్వ‌యంగా ఆహ్వానించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బీసీల్లో ప‌ట్టున్న ఆ మంత్రి పార్టీలో చేరితే ఆ ఎఫెక్ట్ రెండు జిల్లాల్లో ఉంటుంద‌ని భావించే జ‌గ‌న్ ఈ డెసిష‌న్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు పార్టీ సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న ప్ర‌కాశం జిల్లాలోనూ ప్ర‌జ‌ల్లో మంచి ప‌ట్టున్న ఓ మాజీ మంత్రి కోసం జ‌గ‌న్ అండ్ వైసీపీ నాయ‌క‌త్వం వ‌ల విసురుతోంది.

కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డిని వైసీపీలోకి తీసుకుని ఈ సారి అక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని వైసీపీ నాయ‌కులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌హీధ‌ర్‌రెడ్డి వైఎస్‌కు ప్రియ‌శిష్యుడు. ఆయ‌న కందుకూరు నుంచి 2004, 09 ఎన్నిక‌ల్లో గెలిచి ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. కులాల‌కు అతీతంగా ఆయ‌న‌కు అక్క‌డ ప‌ట్టు ఉంది.

కందుకూరు రాజ‌కీయాల్లో ఆయ‌న మూడు ద‌శాబ్దాల‌కు పైగా మ‌మేక‌మై ఉన్నారు. 1989లో ఇక్క‌డ గెలిచిన ఆయ‌న 1994, 99 ఎన్నిక‌ల్లో రెండుసార్లు దివి శివ‌రాం చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోనూ గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి జంప్ చేసేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్క‌డ ఆ పార్టీ నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

టీడీపీలో లుక‌లుక‌లు… వైసీపీకి క‌లిసొచ్చేనా…
కందుకూరులో వైసీపీ నుంచి గెలిచిన పోతుల టీడీపీలోకి రావ‌డంతో ఇక్క‌డ టీడీపీలో రెండు ద‌శాబ్దాలుగా పాతుకుపోయిన దివి శివ‌రాం జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో దివి శివరాంను సంతృప్తిపరిచేందుకు ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. అయితే ఆయ‌న మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోతుల‌కు స‌హ‌క‌రించ‌ర‌ని కూడా తెలుస్తోంది. పోతుల టీడీపీలోకి వెళ్ల‌డంతో జ‌గ‌న్ ఇక్క‌డ తూమాటి మ‌ధ‌వ‌రావును ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. ఆయ‌న అంత బ‌ల‌మైన వ్య‌క్తి కాద‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని కొంద‌రు నాయ‌కుల‌తో పాటు పార్టీలో సీనియ‌ర్లు కూడా భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న లుక‌లుక‌ల‌ను క్యాష్ చేసుకుని ఇక్క‌డ విజ‌యం సాధించాలంటే మ‌హీధ‌ర్ రెడ్డి అయితేనే క‌రెక్ట్ అని భావిస్తోన్న జిల్లా వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్ల‌డంతో ఆయ‌న మ‌హీధ‌ర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీలోకి వెళితే కందుకూరులో ఆయ‌న‌కే ప్ల‌స్ ఉంటుంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. మ‌రి ఎన్నిక‌ల నాటి ప‌రిణామాలు ఎలా మార‌తాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*