వామ్మో బెంగుళూరా…? అంటున్న నేతలు…!

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. వివిధ రాష్ట్రాల నుంచి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అతిధులు రావడంతో బెంగుళూరు పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించలేకపోయారు. వీవీఐపీలు సయితం ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్ సమస్య మమత బెనర్జీకి కూడా ఎదురయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీఎస్పీ అధినేత్రిమాయవతి కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. కొద్దిదూరం వారు సభా వేదిక వరకూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.

ట్రాఫిక్ జామ్ తో…..

విధానసభలో ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో మొత్తం నాలుగు గేట్లలో ఒక గేటును మాత్రమే పోలీసులు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా తెరచి ఉంచారు. గవర్నర్ వాజూభాయివాలా, మాజీ ప్రధాని దేవగౌడ, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కుమారస్వామి కాన్వాయ్ లను మాత్రమే వేదిక వరకూ అనుమతించారు. వారి వెంట వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ లోచిక్కుకున్న మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో పాటు అసంతృప్తికి కూడా గురయ్యారు.

మమత అసహనం…..

దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కర్ణాటక డీఐజీ నీలమణిరాజు ఎదుటే ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రమాణస్వీకారానికి వచ్చిన నేతలందరూ ఆనందంగానే కన్పించినా మమత మాత్రం కొంత అసహనానికి గురయినట్లు వేదికపై కన్పించడం విశేషం. అయతే పోలీసులు మాత్రం దీన్ని సమర్థించుకుంటున్నారు. తాము ఊహించని విధంగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదంటున్నారు. వీవీఐపీ వాహనాలన్నీ ఒకే సమయానికి రావడంతో ట్రాఫిక్ ను అదుపు చేయలేకపోతున్నామని బెంగుళూరు పోలీసులు సయితం అంగీకరిస్తున్నారు.

కేజ్రీవాల్ నడుచుకుంటూ…..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో అరవింద్ కేజ్రీవాల్ కారు దిగి వేదిక వరకూ నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చందా ట్విట్టర్లో తెలిపారు. బెంగుళూరు లాంటి ట్రాఫిక్ దేశంలో మరెక్కడా లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు బెంగుళూరు పోలీసుల ప్రణాళిక లోపం కారణంగా ఇబ్బందులు పడ్డారు. మమత బెనర్జీ అయితే అసహనం వ్యక్తం చేశారు గాని, మిగిలిన నేతలు పరిస్థితీ దాదాపుగా అంతేనని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*