దీదీ దిగివస్తుందంటారా?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రాపకానికి కాంగ్రెస్ పాకులాడుతోంది. మమత కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? లేక ఝలక్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీని, భారతీయ జనతాపార్టీని మట్టి కరిపించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తున్న పార్టీలతో పొత్తు కోసం తాపత్రయ పడుతోంది. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే మమత ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా? లేదా? అన్నది బిగ్ క్వశ్చన్.

వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో…..

మమత బెనర్జీ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేయాలని, కలసి పోటీ చేస్తే బీజేపీని సులువుగా ఓడించవచ్చన్నది తరచూ అభిప్రాయపడుతున్నారు. త్రిపుర ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కాంగ్రెస్, సీపీఎం కలసి పోటీ చేసి ఉంటే బీజేపీని ఓడించగలిగి ఉండేవారమని, పొత్తు లేకుండా దిగడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పని ఆమె అన్నారు. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మమత ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ కలసి ఉంటే పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేదని ఆమె ట్వీట్ చేశారు. ఇలా ప్రతి ఎన్నికల్లో ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు.

తన విషయంలో మాత్రం…..

కాని తన విషయానికి వచ్చే సరికి మమత ఆ అభిప్రాయాలపై నిలబడతారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో మమతకు ప్రస్తుతం తిరుగులేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఉప ఎన్నికల్లో గాని తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడకో వెళ్లిపోయింది. అక్కడ కాంగ్రెస్ వీక్ గా ఉందన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ కు సరైన నాయకత్వమే లేదక్కడ. కమ్యునిస్టులు సయితం అన్నీ ఎన్నికల్లో భంగపాటుకు గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ దూసుకు వస్తుంది. ఆ రాష్ట్రంపై కమలనాధులు ప్రత్యేక దృష్ఠి పెట్టారు.

బలంగా ఉన్న మమత……

ఇప్పుడు కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రాజన్ చౌదరి వచ్చే ఎన్నికల్లో మమతతో కలసి నడవాలని నిర్ణయించారు. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తే తమకు వచ్చే స్థానాలు తగ్గుతాయన్నది తృణమూల్ కాంగ్రెస్ నేతల భావన. పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు కొన్ని సీట్ల కేటాయించాల్సి ఉంటుంది. కమ్యునిస్టులతో ఎటూ పొత్తు ఉండదు. ఎటూ ఆ ఓటు బ్యాంకు చీలుతుంది. దీనివల్ల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే లాభమేంటన్న ప్రశ్న కూడా తృణమూల్ నేతల నుంచి వస్తుంది. కాంగ్రెస్ మమతతో పొత్తుకు ఉత్సాహం చూపుతున్నాఆమె అంగీకరిస్తారా? లేక ఎన్నికల అనంతరం పొత్తు అంటారా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*