మమత మారదు…మారలేదు…!

మమత బెనర్జీ…ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరు. నీళ్లు నమలడం, నంగినంగిగా మాట్లాడటం ఆమెకు తెలియని విద్య. తెలిసిందల్లా…. ఎదురొడ్డి పోరాడటమే. ప్రత్యర్థులు ఎంతటి వారైనా ఢీకొనడానికి సిద్ధంగా ఉంటారు. వెనకడుగు వేయడం ఆమెకు చేతకాదు. ఈ ప్రత్యేక లక్షణాలే ఆమెను సాధారణ కార్యకర్త నుంచి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరకూ తీసుకెళ్లాయి. ఈ లక్షణాలే ఈ బెంగాలీ దీదీని జాతీయ రాజకీయనాయకురాలిని చేశాయి. ఈ లక్షణాలే మమతను పత్యర్థులకు సింహస్వప్నంగా తీర్చిదిద్దాయి. ఒక్క మాటలో చెప్పాలంటే… పోరాటం ఆమె జీవితంలో భాగమైంది. కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన మమత నేడు ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొనే స్థాయికి చేరుకున్నారు.

అందరికీ చుక్కలు చూపించి……

ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన మమత మహా మొండిమనిషి. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లనే తత్వం. ఎవరినీ లెక్క చేయని నైజం. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. సొంత పార్టీలో ప్రణబ్ ముఖర్జీ నుంచి పీవీ నరసింహారావు వరకూ, విపక్షంలో జ్యోతిబసు నుంచి నేటి నరేంద్ర మోదీ వరకూ ఎవరినైనా నిలదీయగల దమ్మున్న లీడర్ మమత బెనర్జీ. బెంగాల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి) శల్యసారథ్యం వహిస్తున్నారని 90 దశకంలో దునుమాడారు. పీవీ రాజనీతిజ్ఞతను పశ్చిమబెంగాల్ లో సీపీఎం ను గద్దెదించడానికి ఉపయోగపడిందని ధైర్యంగా చెప్పిన ధీశాలి. కమ్యునిస్టు హయాంలో పశ్చిమబెంగాల్ ప్రగతి ఆగిపోయిందని ఎత్తి చూపిన దిగ్గజం. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీని నేరుగా ఢీకొంటున్న నాయకురాలు మమతబెనర్జీనే కావడం గమనార్హం.

రెండుసార్లు సీఎంగా…..

ఎంపీగా కేంద్రమంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తలపోస్తున్నారు. మోదీని ఢీకొనడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని అవకాశంగా తీసుకుని చెలరేగిపోతున్నారు. కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు చేయని సాహసాన్ని ఆమె చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ (ఒడిశా) నితీష్ కుమార్ (బీహార్), కేసీఆర్ (తెలంగాణ), నారా చంద్రబాబునాయుడు (ఆంధ్రప్రదేశ్) వంటి నాయకులు ఏదో ఒక కారణంతోనో, ఇబ్బందుల వల్లనో మోదీని లక్ష్యంగా చేసుకోలేకపోతున్నారు. ఒక్క మమత మాత్రమే ఈ విషయంలో ముందుండటం గమనార్హం. మమత, కేజ్రీవాల్ అంత ధాటిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి మోదీని దుయ్యబట్టలేకపోతున్నారు. వివిధ కారణాల వల్ల ప్రతిపక్ష ప్రాంత ముఖ్యమంత్రులు మోదీతో సర్దుకుపోవడమో లేదా తటస్థంగా ఉండటమో లేక మౌనంగా ఉండటమో జరుగుతుంది. ఒక్క మమత మాత్రమే ఇందుకు మినహాయింపు కావడం గమనార్హం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు మమత పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలను ఆమె అక్కున చేర్చుకుంటున్నారు.

అతిపెద్ద రాష్ట్రానికి……

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా 42 లోక్ సభ, 294 అసెంబ్లీ నియోజకవర్గాలు గల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోఆశాకిరణంగా కనపడుతున్నారు. మోదీని ఒంటరిని చేసేందుకు భావ సారూప్యంగల ప్రాంతీయ, జాతీయ పార్టీలను అక్కున చేర్చుకుంటున్నారు. 2009లో 19, 2014లో 34 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ విపక్ష శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్క సీపీఎంతో తప్ప ఇతర పార్టీలతో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. సొంత రాష్ట్రంలో సీపీఎం ప్రత్యర్థి కావడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కలసి పనిచేయడం కాస్త ఇబ్బందే. కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వామపక్షాలతో కలసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు.

దీదీ అని పిలిపించుకుంటూ….

బెంగాలీలు ‘‘దీదీ’’ అని అభిమానంగా పిలుచుకునే మమత 1955 జనవరి 5న సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పీజీతో పాటు న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. వివాహానికి దూరంగా ఉన్న దీదీ కాంగ్రెస్ తో రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ జ్యోతిబసు నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. లోక్ సభ కన్వీనర్ గా పనిచేసి ఇటీవల కన్నుమూసిన సీపీఎం దిగ్గజం సోమ్ నాథ్ ఛటర్జీని 1984లో జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి ఓడించి చరిత్ర సృష్టించారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. దక్షిణ కోల్ కత్తా నియోజకవర్గం నుంచి వరుసగా 1998, 1999, 2004,2009 ఎన్నికలలో గెలిచిన మమత పీవీ, వాజ్ పేయి మంత్రివర్గంలో పనిచేశారు. రైల్వే మంత్రి చేపట్టిన తొలి మహిళ ఆమె కావడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా ఆే కావడం గమనార్హం. బెంగాల్ కాంగ్రెస్ రాష్ట్రంలో సీపీఎంకు బీటీమ్ గా మారిందని ధ్వజమెత్తిన ధీశాలి ఆమె.

నేత చీరతో కన్పించినా….

నందిగ్రామ్, సింగూర్ భూముల వ్యవహారంలో వామపక్ష సర్కారుపై ధీటుగా పోరాడారు. కాంగ్రెస్ సారథ్యంలో కమ్యునిస్టులపై పోరాటం చేయలేకపోతున్నానంటూ 1998లో సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. 2011లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని 184 స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. తనచిరకాల వాంఛ అయిన రైటర్స్ బిల్డింగ్ (రాష్ట్ర సచివాలయం) పేరు లో అడుగుపెట్టారు. 2011లో కూడా మళ్లీ మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఏకంగా 211 స్థానాలను సాధించడం విశేషం. నేత చీరతో నిరాడంబరంగా కనపించే మమత పోరాటంలో కలకత్తా కాళిని తలపిస్తారు. ప్రత్యర్థులపై ఒంటికాలి మీద లేస్తారు. సీపీఎం ను మట్టి కరపించిన మమత ఇప్పుడు నరేంద్ర మోదీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అన్నీఅనుకున్నట్లు జరిగితే విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఆవిర్భంచగలరు. అంతటి సత్తా ఈ బెంగాల్ బెబ్బులికి ఉందనడంలో సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్