“బెబ్బులి”ని వేటాడటం కోసం…??

mamathabenerjee-bharathiay-janatha-party

పశ్చిమబెంగాల్ లో పార్టీ విస్తరణకు, పటిష్టతకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్, సీపీఎంలను పక్కన బెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి సవాల్ విసరాలని భావిస్తోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, మోదీని నేరుగా ఢీకొంటున్న మమత ముందరి కాళ్లకకు బంధం వేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఆమెకు రాజకీయంగా ఊపిరాడకుండా చేయడం ద్వారా ఢిల్లీ వైపు కన్నెత్తి చూడకుండా చేయాలన్నది కమలనాధుల ఆలోచన. ఇందులో భాగంగానే ఇటీవల రధయాత్ర ల పేరుతో బెంగాల్ లో హడావిడి చేసేందుకు అధ్యక్షుడు అమిత్ షా యత్నిస్తున్నారు. బీజీపీ రధయాత్రలకు బ్రేక్ వేసేందుకు మమత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కోల్ కత్తా హైకోర్టులో చుక్కెదురయింది తొలుత యాత్రకు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. దీంతో కమలం పార్టీ అప్పీల్ కు వెళ్లింది. యాత్రను అడ్డుకోవడం తగదని అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని జస్టిస్ విశ్వనాథ్ సోమద్దీర్, జస్టిస్ ముఖర్జీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. యాత్రకు అనుమతి నిరాకరించడం ద్వారా మమత పెద్ద తప్పు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడైనా సభలు, సమావేశాలు, యాత్రలు తదితర కార్యక్రమాలు చేసుకోవచ్చని, వాటిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని చెబుతున్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని భావిస్తే ఆ మేరకు తగినచర్యలు తీసుకోవాలి తప్ప, అసలు యాత్రలనే అడ్డుకోవడం తగదన్న భావన వ్యక్తమవుతోంది. శాంతి భద్రతల పరిరక్షణ అంశం రాష్ట్ర పరిధిలోని అంశమన్న విషయాన్ని ప్రజాస్వామ్య వాదులు గుర్తు చేస్తున్నారు.

అక్కడ నష్టపోయే సీట్లను…..

2019 ఎన్నికల్లో ఉత్తరాది ఎన్నికల్లో నష్టపోయే మేరకు, తూర్పు, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో సీట్లు భర్తీ చేయాలన్నది కమలనాధుల వ్యూహం. ఇందులో భాగంగానే ముందు బెంగాల్ పై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు తగిన పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తోంది. ప్రదాన ప్రతిపక్షమైన సీపీఎం పూర్తిగా బలహీన పడటం, కాంగ్రెస్ పరిస్థితీ అదే విధంగా ఉండటంతో ద్వితీయ శక్తిగా ఎదగాలన్నది కమలనాధుల వ్యూహం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 12.25 శాతం ఓట్లు సాధించిన హస్తం పార్టీ 44 అసెంబ్లీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. కొంచెం అటు ఇటుగా 10.16 శాతం ఓట్లు తెచ్చుకున్న కమలం పార్టీ మాత్రం మూడు స్థానాలకే పరిమితమైంది. ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదు కాబట్టి పోల్ మేనేజ్ మెంట్ లో పకడ్బందీగా వ్యవహరిస్తే సీట్లు పెరుగుతాయన్నది కమలనాధుల అంచనా.

గత ఎన్నికల్లో…..

రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లున్నాయి. 42 లోక్ సభ స్థానాలున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు, కాంగ్రెస్ నాలుగు స్థానాలు సాధించగా, కమలం కూడా రెండు సాధించింది. మరో మూడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ లెక్కలు కమలంలో ఆశలు నింపుతున్నాయి. రధయాత్రకు ప్రేరణ ఇవే. అసన్ సోల్ నుంచి గెలిచిన బాబుల్ సుప్రియో కేంద్రమంత్రి అయ్యారు. గుర్ఖాలాండ్ గా పేరుగాంచిన డార్జిలింగ్ నుంచి ఎస్.ఎస్. అహ్లువాలియా ఎన్నికయ్యారు. కోల్ కత్తా ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలతో పాటు మాల్దా దక్షిణ నియోజకవర్గంలో గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కోల్ కత్తా దక్షిణ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి తథాగత్ రాయ్ 2.95 లక్షల ఓట్లు, 25. 28 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. రాయ్ ఇప్పుడు మేఘాలయ గవర్నర్ గా ఉన్నారు. కోల్ కత్తా ఉత్తర స్థానంలో పార్టీ అభ్యర్థి రోహత్ సిన్హా 2.47 లక్షల ఓట్లు, 25.28 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మాల్దా దక్షిణ స్థానం నుంచి పార్టీ నాయకుడు బిష్ణు పాదరాయ్ 2.16 లక్షల ఓట్లు, 19.79 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మల్దా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ముస్లింలు ఎక్కువగా గల ఇక్కడి నుంచి కాంగ్రెస్ దిగ్గజం అబ్దుల్ ఘనీ ఖాన్ చౌదురి పలుమార్లు గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన తనయుడు అబూ హసీనా ఖాన్ చౌదురి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఏడువేలకు పైగా స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో సీపీఎం, కాంగ్రెస్ ప్రాభవం కోల్పోతున్న తరుణంలో బెంగాల్ లో పట్టు సాధించేందుకు ఇదే సరైన సమయమని కమలనాధులు అంచనా వేస్తున్నారు.

హిందూ ఓటు బ్యాంకును…..

ఇక జనాభా పరంగా చూస్తే బెంగాల్ లో ముస్లిం జనాభా ఎక్కువ. ముఖ్యంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులే అధికం. వీరి ఓట్లతోనే గతంలో సీపీఎం పాలన సాగించింది. ఇప్పుడు కూడా మమత ముస్లిం ఓట్లతోనే గద్దెనెక్కింది. ముస్లింల బూచి చూపించి హిందువుల ఓట్లకు గాలం వేయవచ్చని కమలం అంచనా వేస్తుంది. జాతీయ భావాలు, ముస్లిం అక్రమ వలసదారుల అంశాలను లేవనెత్తడం ద్వారా హిందువుల ఓట్లను ఏకీకృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంలో భాగమే రధయాత్రలు. ఈ యాత్రలకు కోల్ కత్తాలో, కుబ్ బెహార్ లో, రాష్ట్రంలోని మరో ప్రాంతం నుంచి ప్రారంభించనుంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య పెరుగుతుందని, కమలనాధులు ద్వితీయ స్థానంలో నిలుస్తారన్న సర్వేల నేపథ్యంలో కమలనాధులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద మమతను గుక్కతిప్పుకోనివ్వకుండా చూడాలన్నది కమలం వ్యూహంగా కనపడుతోంది. ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*