మందా..ఇక ముందుకేనా..?

మందా జగన్నాధం…తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. పాలమూరు జిల్లాలో, ఆ మాట కోస్తే తెలంగాణ ప్రాంతంలోనే రాజకీయంగా ఎదిగిన దళిత నేతల్లో ముందు వరసలో ఉంటారు. నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన 2009 నుంచి 2014 మధ్య కాలంలో ఆయన ప్రతీరోజు ప్రతికలు, టీవీల్లో కనిపించే వారు. కాంగ్రెస్ ఎంపీగా ఉద్యమంలో, 10 జన్ పథ్ పై ఒత్తిడి తేవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇంత చేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ లో చేరారు.

మూడు పార్టీలు…నాలుగు పర్యాయాలు…

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టా పొంది, తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మందా జగన్నాధం ఆరుసార్లు నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి నాలుగుసార్లు విజయం సాధించారు. 1996, 99, 2004, 09లో ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 2004లో తెలుగుదేశం పార్టీ తరుపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన ఐదుగురు ఎంపీల్లో మందా ఒకరు. టీడీపీలో పోలిట్ బ్యూరో మెంబర్ గా కూడా పనిచేశారు. అయితే, అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టిన సందర్భంలో మంద జగన్నాధం తెలుగుదేశం పార్టీ విప్ ని దిక్కరించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. దీంతో అప్పటి లోక్ సభ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరి, తిరిగి 2009లో కాంగ్రెస్ తరుపున అదే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో విజయం సాధించారు.

ఎట్టకేలకు గుర్తించిన టీఆర్ఎస్…

తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ లో ఉన్నా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 2014 ఎన్నికల్లో విజయంపై గట్టి నమ్మకంతో టీఆర్ఎస్ తరుపున బరిలో దిగారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. తరచూ టీవీ చర్చల్లో, పత్రికల్లో కనపడే ఆయన పూర్తిగా కనపడటమే మానేశారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి మారడం, అక్కడి నుంచి టీఆర్ఎస్ లో చేరడం వంటివి మందా జగన్నాధానికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కొంత దెబ్బతీసింది. అయితే, అసలు ఆయన టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఆయనని కొంత ఆలస్యంగానైనా కేసీఆర్ గుర్తించారో ఏమో కానీ, ఆయనను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పరత్యేక ప్రతినిధిగా నియమించారు. అదే పదవిలో ఇప్పటికే వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్ వంటి వారు ఉండగా, ఇప్పుడు మూడో వ్యక్తిగా మందా చేరారు. నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన సేవలు ఢిల్లీలో అవసరమనుకున్నారో లేక ఆయన అసంతృప్తిని చల్లార్చాలనుకున్నారో గానీ మొత్తానికి మందా జగన్నాధానికి ఓ పదవి కల్పించారు. ఇప్పటికైనా ఆయన మళ్లీ యాక్టీవ్ అవుతారో లేదో చూడాలి.