మండవకు ఎదురే లేదా…??

మండవ వెంకటేశ్వరరావు… పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. గత ఐదేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మండవ బరిలో ఉండటం ఖరారయింది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. మాజీ మంత్రి మండవ టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఇష్టుడు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు అన్నీ పరిశీలించిన తర్వాతనే ఇస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి నమ్మకంగా ఉండే వారినే చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు. అందులో మండవ వెంకటేశ్వరరావు ఒకరు. మండవకు సామాజికవర్గం కూడా కలసి వచ్చే అంశమే.

కాంగ్రెస్ నేతల ఆశలు….

అయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంపైన అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ బరిలోకి దిగుతున్నారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే బాజిరెడ్డి గోవర్థన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బహిరంగంగా విమర్శలు చేసిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. తనకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తామని హామీ పార్టీ నుంచి రాబట్టే తాను కాంగ్రెస్ లో చేరారని ఆయన బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ స్థానం టీడీపీకి ఖరారయింది. ఇప్పుడు భూపతి రెడ్డి ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సెటిలర్లే బలం….

నిజామాబాద్ రూరల్ లో ఎక్కువ మంది సెటిలర్లున్నారు. వారిపై మండవ వెంకటేశ్వరరావుకు పట్టుంది. గతంలో డిచ్ పల్లి గా ఉన్న ఈ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ గా మారింది. ఇది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో మండవ వెంకటేశ్వరరావు కూడా పోటీకి సిద్ధమయ్యారు. మండవ కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఇటీవల చంద్రబాబును అమరావతిలో కలిసినప్పుడు ఆయన ఎలాంటి ఇబ్బందులు పడవద్దని, తానున్నానని భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఏపీ ఇంటలిజెన్స్ నుంచి సేకరించిన సర్వే లో కూడా మండవకే ఎక్కువ విజయావకాశాలు ఉండటంతో ఈ సీటును పట్టుబట్టి మరీ పార్టీకి దక్కించుకున్నారాయన.

డీఎస్ సహకారం…?

అయితే మండవకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సహకరిస్తారా? లేదా? అన్నది అనుమానంగా ఉంది. ఒకవైపు బాజిరెడ్డి గోవర్థన్ పై శత్రుత్వం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లోనైనా తమకు భూపతి రెడ్డి తమకు మద్దతు తెలుపుతారని మండవ ఆశతో ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే…ఇక్కడ సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదు కాని ఇటీవలే రాహుల్ గాంధీని కలసి వచ్చారు. బాజిరెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని క్యాడర్ కు డీఎస్ పిలుపునిచ్చారు. దీంతో డీఎస్ ఆశీర్వచనాలు కూడా మండవకు లభిస్తాయని, తద్వారా మండవ గెలుపు ఖాయమని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*