అదే జరిగితే..రొట్టె విరిగి….?

ఇదే అన్ని రాష్ట్రాల్లో జరిగితే భారతీయ జనతా పార్టీ రొట్టె నేతిలో విరిగిపడనట్లే. విపక్షాలన్నీ ఐక్యంగా కదులుదామనుకున్న వేళ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎక్కడికక్కడ తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. బలం ఉన్నా లేకున్నా విపక్షాలన్నీ కలసి పోటీ చేసి ప్రధాని నరేంద్ర మోదీని కేంద్రంలో, బీజేపీని రాష్ట్రాల్లో గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మాయావతి తన దారి వేరని నిరూపిస్తున్నారు. సొంత రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కూటమిలో ఉండకూడదంటున్న మాయావతి, సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు సై అంటున్నారు. ఇలా మాయా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తుంది.

మాయావతి నిర్ణయంతో……

తాజాగా ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లోనూ మాయావతి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసేలా ఉంది. ఛత్తీస్ ఘడ్ లో మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పార్టీ అయిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్ ఘడ్ తో జత కట్టేందుకు మాయావతి రెడీ అయిపోయారు. అజిత్ జోగీ, మాయావతి పార్టీలు కలిసి ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అజిత్ జోగినే మాయావతి కూటమి తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. మొత్తం 90 స్థానాల్లో బీఎస్పీ 35 స్థానాల్లో పోటీ చేస్తుందని, అజిత్ జోగీ పార్టీ 55 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.

కూటమితో కమలం పార్టీకి……

ఈ నిర్ణయం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కల్గించే అంశమే. ఇప్పుడిప్పుడే ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఇటీవల జరిపిన సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. పదిహేనేళ్ల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత తమకు ఓట్ల రూపంలో మారతాయని హస్తం పార్టీ ఆశించింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పై పెద్దగా ఆరోపణలు లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కాని ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, అజిత్ జోగి పార్టీలు బరిలో ఉంటాయని తేలడంతో సర్వే ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశముంది. ఇది బీజేపీకి లబ్ది చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ…..

మాయావతి ఛత్తీస్ ఘడ్ ను ఉపయోగించుకుని రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకుందామని భావిస్తున్నారన్న అనుమానమూ కాంగ్రెస్ పెద్దల్లో లేకపోలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో సయితం మాయావతి ఇదే ఫార్ములాను ఉపయోగిస్తే మాత్రం అక్కడ కూడా కాంగ్రెస్ కు కష్టాలు తప్పవు. ఈ రెండు రాష్ట్రాల్లో బీఎస్సీ, కాంగ్రెస్ లు ప్రధానంగా కూటమిగా ఏర్పడితే తప్ప బీజేపీని గద్దె దించలేవన్నది అందరికీ తెలసిందే. అయితే మాయావతి దారి వేరుగా కనపడుతుండటంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలయింది. మొత్తం మీద మాయావతి తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఎవరికి ఉపయోగపడతాయి? బీజేపీకా? కాంగ్రెస్ కా? అన్నది కొద్దిరోజుల్లేనే తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*