మాయా మాట నెగ్గుతుందా?

మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు కుదిరేట్లు కన్పించడం లేదు. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఉత్తరప్రదశ్ లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు ఇవ్వమని చెబుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిచినవి, రెండో స్థానంలో ఉన్న పార్టీలకే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆ రెండు పార్టీలు చెబుతున్నాయి. దీని ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికలోల యూపీలో కాంగ్రెస్ కు ఎనిమిది సీట్లకు మించి రావు. అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం ఆ ఫార్ములా పనిచేయవంటుంది మాయావతి. తమకు యాభై స్థానాలు ఇవ్వాలని, లేకుంటే ఒంటరి పోరు చేస్తామని మాయావతి సంకేతాలు పంపారు.

యాభై సీట్లు కావాలంటూ….

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పుంజుకుంది. పదిహేనేళ్లుగా అధికారంలో లేకపోవడం, సానుభూతి పనిచేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. అంతేకాదు అనేక సర్వేలు కూడా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ విక్టరీ ఖాయమని, అయితే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు పొందే అవకాశాలున్నాయన్నది సర్వేల సారాంశం. దీంతో మాయావతి పార్టీ మధ్యప్రదేశ్ లో యాభై స్థానాలను అడుగుతోంది.

25కు మించి ఇవ్వలేమని…..

కాని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం పాతిక స్థానాలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య జరిగిన తొలి దఫా చర్చల్లో 25కు మించి ఇవ్వలేమని హస్తం పార్టీ తేల్చి చెప్పింది. దీంతో మాయావతి మధ్యప్రదేశ్ బీఎస్పీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో కొన్ని సీట్లలో గెలుపోటములను నిర్ణయించే పార్టీగా బీఎస్పీ ఉంది. అందుకే మాయావతి యాభై స్థానాలను ఆశిస్తున్నారు.

రాహుల్ నిర్ణయంపైనే…..

కాని కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్ని సీట్లను బీఎస్పీకి వదలి పెట్టడానికి సుముఖంగా లేరు. ఈ సీట్ల ఒప్పందంతో క్యాడర్ లోనూ, నేతల్లోనూ అసంతృప్తి పెరిగి పార్టీకి నష్టం చేకూరుస్తుందని వారు వాదిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళితేనే మోదీని ఢీకొనగలమని రాహుల్ నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో మాయా మాట నెగ్గుతుందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*