ఆనం .. కంటే మేకపాటి …. ఆ..పాటి కాదా?

వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అభ్యంతరాన్ని ఎందుకు తోసి పుచ్చారు? ఆనం రామనారాయణరెడ్డిని ఎందుకు చేర్చు కోవాలనుకుంటున్నారు. నమ్మకంగా ఉన్న మేకపాటి ఆక్షేపించినా జగన్ లెక్క చేయనిదెందుకు? ఇవన్నీ వైసీపీ క్యాడర్ ను వేధిస్తున్న ప్రశ్నలు. వైసీపీ అంటే నెల్లూరు జిల్లాలో మేకపాటి మాత్రమే గుర్తొస్తారు. ఆయన జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి అంటిపెట్టుకుని ఉంటున్నారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరతారని వార్తలు వచ్చినప్పటి నుంచి మేకపాటి కొంత అన్యమనస్కంగానే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతున్నప్పుడే ఈ అంశం చర్చకు వచ్చినా… ఆనం రాకకు మేకపాటి అభ్యంతరం తెలిపినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు.

ఆనం చేరికకు….

తర్వాత ఆనం రామనారాయణరెడ్డి చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో వైసీపీకి మేకపాటి పెద్దరికంగా వ్యవహరించేవారు. ఇటీవల రాజ్యసభ పదవి పొందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో కొంత మేకపాటి హవా పార్టీలో తగ్గిందంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఆనం కూడా చేరుతుండటంతో మేకపాటి ఫ్యామిలీ తమ సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేకపాటికి ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మాత్రమే బలం ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా, ఆయన తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో బాధ్యుడిగా ఉన్నారు.

ఐదు నియోజకవర్గాల్లో…..

అయితే ఆనం రామనారాయణరెడ్డి రాకతో దాదాపు ఐదు నియోజకవర్గాల్లో బలం పెరుగుతుందని జగన్ అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఆనం ఫ్యామిలీకి తొలి నుంచి నెల్లూరు జిల్లాపై మంచి పట్టుంది. కొన్ని దశాబ్దాల నుంచి ఆనం ఫ్యామిలీ నెల్లూరు రాజకీయాలను శాసిస్తోంది. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా పనిచేసి జిల్లాపై మరింత పట్టు పెంచుకోగలిగారు. దాదాపు 80 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆనం కుటుంబీకులది. నెల్లూరు జిల్లా చింతారెడ్డి పాలెం స్వగ్రామం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఆ కుటుంబానిది. అలాంటి ఆనం కుటుంబాన్ని పోగొట్టుకోకూడదన్నది జగన్ భావన.

మేకపాటి కంటే బెటరని…..

ఆనం రామనారాయణరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలోని పాత రాపూరుతో పాటు ఆత్మకూరు, నెల్లూరు సిటి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం, కోవూరు, సర్వేపల్లి నియోకవర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డికి పట్టుంది. అంతేకాకుండా సర్వేపల్లిలో పెద్దయెత్తున ఆనంకు బంధుగణం ఉండటం కూడా కలసివచ్చే అంశమే. నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తొలి నుంచి ప్రత్యేక వర్గం ఉండటం కూడా జగన్ పరిగణనలోకి తీసుకున్నారు. అందుకే మేకపాటి ఫ్యామిలీ అభ్యంతరాలను జగన్ పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆనం చేరికకు మేకపాటి ఫ్యామిలీ అభ్యంతరాలు ఇప్పటికీ తెలుపుతున్నారు. కాని జగన్ మాత్రం మేకపాటికి సర్దిచెప్పి, అధికారంలోకి రావాలంటే సర్దుకుపోవాలని చెబుతున్నారు. మరి ఆనం చేరిన తర్వాతనైనా ఈ ఇద్దరు నేతలు కలసి పనిచేస్తారో? లేదో? చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*