మేకపాటి ఓటమికి బాబు కొత్త ఎత్తుగడ?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆదిశ‌గా కార్యాచ‌రణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బీసీలే పార్టీకి వెన్నెముకంటూ.. ఆది నుంచి ఆయ‌న ప్రవ‌చిస్తు న్న అంశాన్ని తూ.చ‌. త‌ప్పకుండా పాటించాల‌ని నిర్ణయించారు. ప్రధానంగా వైసీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ సూత్రం పాటించాల‌ని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం నెల్లూరులో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఇక్కడి ప‌రిస్థితిని చ‌క్కదిద్దు కోవాల‌ని నిర్ణయించారు. దీనికి గాను ఆయ‌న బీసీ మంత్రాన్ని ప్రయోగించాల‌ని తాజాగా నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెల‌సింది. నెల్లూరు ఎంపీ స్థానంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి గెలుపొందారు.

గట్టి పోటీ ఇచ్చినా…..

ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి మేక‌పాటికి గ‌ట్టి పోటీ ఇచ్చారు. కేవ‌లం 12 వేల ఓట్లతోనే మేక‌పాటి గ‌ట్టెక్కారు. అది కూడా ఆత్మకూరు నుంచి వ‌చ్చిన భారీ మెజార్టీతోనే మేక‌పాటి విజ‌యం సాధించారు. అయితే, రాష్ట్ర ప్రత్యేక హోదా విష‌యంపై కేంద్రంపై చేసిన పోరులో భాగంగా ఆయ‌న ఈప‌ద‌విని వ‌దులుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేలా ఇప్పటి నుంచి ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు పోతున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఆదాలను తప్పించి…..

దీనిలో భాగంగా అప్పట్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాక‌ర్ రెడ్డికి కాకుండా బీసీ అయిన బీద మ‌స్తాన్ రావు బెట‌ర‌ని ఆయ‌న నిర్ణయించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే అయిన బీద మస్తాన్‌రావు వివాద ర‌హితునిగా పేరు తెచ్చుకున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా కూడా పేరు సంపాయించుకున్నారు. ఆయ‌న చంద్రబాబుకు న‌మ్మిన బంటు. పైగా బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో చంద్రబాబు ఈయ‌న‌వైపు మొగ్గార‌ని స‌మాచారం. ఇక‌, ఎంపీగా పోటీ చేసేందుకు బీద కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది.

ఇదే జరిగితే…..

మ‌స్తాన్ రావును బ‌రిలోకి దింపితే.. బీసీ సామాజికవర్గం మొత్తం ఆయన వెంట ఉంటుందనే భావన పార్టీలో ఉంది. అదే విధంగా నెల్లూరు రూరల్‌, నెల్లూరు పట్టణ అభ్యర్థులుగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి పి.నారాయణలు పోటీ చేస్తే..ఆ ఊపు..ఎంపీ అభ్యర్థిపై ఉంటుందని.. తద్వారా ..పార్టీ విజ‌యం సాధించ‌డం పెద్ద క‌ష్టమేమీ కాద‌ని అంటున్నారు. రెడ్డి సామాజికవర్గంలో మెజార్టీ ఓట్లు…వైసీపీకే వెళ్లినా.. బీసీ వ‌ర్గానికి చెందిన ఓట్ల‌తో టీడీపీని గెలిపించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని నేత‌లు అంచ‌నాకు వ‌చ్చారు. మ‌రి ఇదే క‌నుక స‌క్సెస్ అయితే, బీద గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి బాబు న‌యా ప్లాన్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*