ఎవరికి సర్దిచెబుతారో….!!

mekedatu-karnataka-tamilnadu

పొరుగు రాష్ట్రాలంటే సహజంగా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అందులో నీటి వివాదాలు ముఖ్యం. నీటి కోసంయుద్ధాలే జరిగిన సంఘటనలను చరిత్రలో చూశాం. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కూడా ఇదే ప్రారంభమయింది.అయితే జలవివాదంపై కోర్టులను ఆశ్రయించే వీలున్నా… ఈ వివాదం భవిష్యత్తులో కూటమి ఏర్పాటుపై ప్రభావం పడే అవకాశాలున్నాయంటున్నారు. రెండు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయడం సర్వసాధారణం. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా జట్టుకట్టే కూటమిలో ఈ రెండు రాష్ట్రాల్లోని పార్టీల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

కూటమి ఏర్పాటు సమయంలో….

ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో మోదీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి విపక్షాలన్నీ సమావేశమవుతున్నాయి. అయితే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడుల మధ్య ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలోనూ లేవనెత్తే అవకాశముందంటున్నారు. కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ లు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇటీవల కావేరీ జలాలకు అడ్డుకట్ట వేయడానికి మేకెదాటు ప్రాజెక్టు ను చేపట్టాలని నిర్ణయించింది. అయితే తమిళనాడులో అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తుండటంతో కర్ణాటకలోనూ అన్ని పార్టీలూ మేకెదాటును నిర్మించాల్సిందేనని కుమారస్వామి నేతృత్వంలో అన్ని పార్టీలూ నిర్ణయించాయి.

డీఎంకే సీరియస్…..

తమిళనాడులో కూడా మేకెదాటు పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలో ఉన్న డీెఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేకెదాటుకు వ్యతిరేకంగా స్టాలిన్ నేతృత్వంలో ఆందోళనలు కూడా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మేకెదాటు సమస్య పరిష్కారం విషయంలో డీఎంకే చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. ఇదే విషయాన్ని అధికార అన్నాడీఎంకే పదే పదే ప్రస్తావిస్తూ ఉంది.

పట్టు వదలని రెండు రాష్ట్రాలు…..

తమిళనాడును దారికి తేవాలని కర్ణాటక సర్కార్ ముందడుగు వేస్తోంది. జలవివాదాల న్యాయమండలి కూడా మెకేదాటు నిర్మాణానికి ఆమోదం తెలపడంతో పార్టీలకతీతంగా అంతా ఒక్కటయ్యారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటినే తాము వాడుకుంటామని కర్ణాటక చెబుతోంది. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడులో రాజకీయంగా పార్టీలన్నీ వేరైనా రాష్ట్ర సమస్యలు వచ్చేసరికి అంతా ఏకమవుతారు. ఇప్పటికే దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో మెకేదాటు వివాదం రాజుకుంది. దీని ఎఫెక్ట్ కూటమిపై పడుతుందేమోనన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. మరి రాహుల్ గాంధీ ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపిస్తారో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*