ఈసారి ఎలాగైనా గెలవాల్సిందేనని…?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌క్తిక‌డుతోంది. మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వాతావ‌రణం కొంత భిన్నంగా ఉంటోంది. ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల కంచుకోటైన సూర్యాపేట‌లో వామ‌ప‌క్షాల నేత‌లు ముప్పైఏళ్లు అధికారంలో ఉన్నారు. 2014ఎన్నిక‌ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ నుంచి జ‌గ‌దీశ్‌రెడ్డి విజ‌యం సాధించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌దీశ్‌రెడ్డి కొద్దిపాటి తేడాతోనే బీజేపీ అభ్య‌ర్థిపై విజ‌యం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో మంత్రి ఉన్నారు. ఇదే స‌మయంలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు పావులు క‌దుపుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం జ‌గ‌దీశ్‌రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.

అంత సులువు కాదా?

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ గెలుపు మాత్రం అంత సులువుకాద‌నే టాక్ వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్లు గనక వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే టీఆర్ ఎస్ కు గడ్డు పరిస్థితి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో జగదీశ్ రెడ్డికి ఇండిపెండెంట్‌ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్లు గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి కేవలం 2, 200 ఓట్లతో సంకినేనిపై విజయం సాధించారు. మ‌రోవైపు నియోజకవర్గంలో బలంగా ఉన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేనిపై టీఆర్ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయనను టీఆర్ఎస్ లో చేర్చుకుని….

సంకినేనిని టీఆర్‌ఎస్ లో చేర్చికొని వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేయించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో అధికార పార్టీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేరు. ఈ నేప‌థ్యంలో సంకినేనిని పార్టీలో చేర్చుకొని, కోదాడ నుంచి పోటీకి దింపాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో సూర్యాపేట‌లో మంత్రిజ‌గ‌దీశ్‌రెడ్డికి లైన్ క్లియ‌ర్ అవుతుంద‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

నాడు గెలుపు… నేడు అష్ట‌క‌ష్టాలు….

జ‌గ‌దీశ్‌రెడ్డి ప్ర‌జాక్షేత్రంలో పెద్ద‌గా బ‌ల‌మైన వ్య‌క్తి కాదు. కేసీఆర్‌కు ఆయ‌న అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న 2009లో హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మీద ఏకంగా 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ ఎలాగూ గెల‌వ‌లేన‌ని డిసైడ్ అయ్యి సూర్యాపేట‌కు మారారు. ఇక్క‌డ నాలుగు స్తంభాలాట‌లో ఆయ‌న చాలా స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే గెలిచారు. టీఆర్ఎస్ నుంచి జ‌గ‌దీశ్‌రెడ్డి, రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్య‌ర్థి సంకినేని వెంక‌టేశ్వ‌ర్లు ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఉన్న మాజీ మంత్రి దామోద‌ర్‌రెడ్డికి 39175 ఓట్లు వ‌స్తే, నాలుగో స్థానంలో ఉన్న టీడీపీ అభ్య‌ర్థి 38529 ఓట్లు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి ఇక్క‌డ న‌లుగురు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య ఓట్ల చీలికే ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిందే త‌ప్పా జ‌గ‌దీశ్‌రెడ్డి గెలుపు స్ట్రాంగ్‌గా అయితే లేదు.

ఈ సారి గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మే…

ఇదిలా ఉండ‌గా.. గ‌తంలో సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేలో గ్రాఫ్ ప‌డిపోయిన జ‌గ‌దీశ్‌రెడ్డి ఆ త‌ర్వాత ప‌నితీరు మార్చ‌కోవ‌డం గ‌మ‌నార్హం. పాలేరు జలాలను సూర్యాపేటకు తాగు, సాగు నీటి కోసం మళ్లించడంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డికి సహకరించారు. మరోపక్క జాతీయ రహదారుల ఏర్పాటు అంశాలు మంత్రి జగదీశ్ రెడ్డికి కొంత ఊరటనిస్తున్నాయి. ముఖ్యమంత్రి కి జగదీశ్ రెడ్డి అత్యంత సన్నిహితుడుగా ఉండటంతో సూర్యాపేట నియోజకవర్గంపై కేసీఆర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న సూర్యాపేట నుంచి గ్రేట‌ర్‌లోని ఎల్బీన‌గ‌ర్‌కు మారిపోతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఎన్ని చేసినా ఈ సారి జ‌గ‌దీశ్‌రెడ్డి ఇక్క‌డ బీజేపీ, కాంగ్రెస్‌తో ట్ర‌యాంగిల్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. ఈ పోటీలో ఆయ‌న గెలిచే వ‌ర‌కు న‌మ్మ‌కం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*