
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు..? ఎవరెవరికి టికెట్లు ఇవ్వబోతున్నారు..? పలుమార్లు చెప్పినట్లు సిట్టింగులందరికీ మళ్లీ అవకాశం ఇస్తారా..? సీనియర్లకు పట్టంకడుతారా..? పక్కన పడేస్తారా..? ఆశావహులతో కిక్కిరిసిన కారు ముందుకు వెళ్తుందా..? ఓవర్లోడ్తో కదలలేక ఆగిపోతుందా..? ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్ని వెంటాడుతున్న ప్రశ్నలివే. ఇందులో అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టమేగానీ.. కొందరు సీనియర్లు.. అందులోనూ మంత్రులకు మాత్రం ఈసారి నో ఛాన్స్ అంటూ ప్రచారం జోరందుకుంది. గులాబీ బాస్ వారికి టికెట్లు ఇవ్వడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. వీరిస్థానంలో మరికొందరిని తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మహమూద్ అలీ వారసుడు…..
ఆ నో ఛాన్స్ మంత్రుల్లో ముగ్గురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇందులో ముందుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు. ఈయనకు వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కడం కష్టమేనని పలువురు నాయకులు అంటున్నారు. వయస్సు మీదపడిన దృష్ట్యా ఆయన స్థానంలో మరొకరికి అవకాశం.. అంటే ఆయన తనయుడినే తీసుకొచ్చేందుకు మహమూద్ అలీ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన కూడా వచ్చినట్లు సమాచారం. ఆయన గత ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. మండలికి ఎంపికై ఆ కోటాలో మంత్రి అయ్యారు.
నాయిని కి అవకాశం….?
ఇక హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నాయిని కూడా గతంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసినా గత ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి అయ్యారు. అయితే, వీరిద్దరి స్థానంలో వీరికంటే తర్వాత స్థానంలో ఉన్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నారు. అయితే నాయిని మాత్రం తాను పోటీ చేస్తానని చెబుతున్నారు.
వీరిద్దరూ కూడా…..
ఇక ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వరనీ.. ఒకవేళ ఇచ్చినా.. ఆయన మంత్రి పదవి మాత్రం దక్కదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఆయన బీఎస్పీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చందూలాల్ కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారని పలువురు అంటున్నారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిజానికి ఆయనను మధ్యలోనే మంత్రిపదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారనే టాక్ కూడా వినిపిచించింది.
కొత్త వారికి ఛాన్స్…..
గత ఎన్నికల్లో ఈ నాలుగేళ్లలో ఇతర పార్టీల నుంచి పలువురు సీనియర్లు గులాబీ గూటికి చేరారు. ఆ సీనియర్ మంత్రుల స్థానాల్లో కేసీఆర్ కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వకపోవడం, ఎన్నికల్లో గెలుపు ఓటముల తర్వాత మంత్రివర్గంలో చాలా మార్పులు, చేర్పులు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే సరికొత్త మంత్రివర్గం చూడొచ్చు.
Leave a Reply