ఇదేమి రాజకీయం?

చట్టసభల్లో అధికారపక్షం, ప్రతిపక్షం వారే వుండాలని భావిస్తున్నారు. ఇక ప్రతిపక్షానికి ఆయుధంగా వుండే నిరసన కార్యక్రమాలు హైజాక్ చేస్తున్నారు. మొత్తానికి ఒక అయోమయానికి తెరతీస్తున్నాయి అధికారపార్టీలు. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అదే తీరు ఇప్పుడు కొత్త ట్రెండ్. నిన్న మొన్నటి వరకు ఇలాంటి సీన్లు ఏపీలో కోకొల్లలుగా కనిపించేవి. తెలంగాణ అసెంబ్లీలోనూ అవే సీన్లు. ఒక్క అసెంబ్లీలోనే కాదు వీధుల్లోనూ అధికారపార్టీనే విపక్ష అవతారం దాల్చేస్తుంది.

ప్రధాని మోడీ ఎప్పుడు ప్రత్యేకమే …

దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీ తీరే వేరు. ఆయన ఏమి చేసినా అందులో ఎదో ఒక ప్రత్యేకం ఉంటుంది. ప్రధాని కాకముందు చాయ్ కి బాత్ తో అందరిని ఆకట్టుకున్నారు మోడీ. ప్రధాని అయ్యాకా మన్ కి బాత్ అంటూ రేడియో ప్రసంగాలతో మరో కార్యక్రమంతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. ప్రచారం పొందడంలో ఆయన ఎప్పుడు నెంబర్ వన్. దీనికోసం ఆయన ఎంచుకునే మార్గాలు విభిన్నంగా ఉంటాయి.

ఇప్పుడు నిరసన దీక్ష తో …

పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పనికిరాకుండా పోయిన పాపం విపక్షాలమీద పడేసే పనిలో పడ్డారు ప్రధాని. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం దీక్ష. నెలరోజులపాటు సుమారుగా సభ సజావుగా నడవకపోవడానికి విపక్షాలే కారణమంటూ కొత్త వాదనతో పాటు తప్పంతా వారిదే అన్న రీతిలో ఎటాకింగ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు ఆయన. పార్లమెంట్ ను నడవనీయకుండా చర్చలు జరగనీయకుండా అడ్డుతగలడం వల్లే సమావేశాలు ఇలా అఘోరించాయనే మెసేజ్ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నానికి నిరసన దీక్ష తో శ్రీకారం చుట్టనున్నారు.

అసలు వాస్తవం ఇది …

స్కూల్ లో పిల్లలు అల్లరి చేస్తుంటే వారిని టీచర్ మందలిస్తారు. అయినా పధ్ధతి మారకపోతే వారిని క్లాస్ నుంచి సస్పెండ్ చేస్తారు. రోజు అదే పని చేస్తే టిసి ఇచ్చి పంపించేస్తారు. కానీ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ స్పీకర్లు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ అధికారాలను వారు ఆయా ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగా తీసుకుంటున్నారు. చర్చించడానికి అధికారపక్షానికి ఇష్టం లేకపోతే సభలో అల్లరి సాకుగా చూపి సభ వాయిదా వేయడం అవసరమైతే నిరవధికంగా వేయడం చేసేస్తున్నారు. అదే తమకు అవసరమైనప్పుడు అల్లరి చేసే సభ్యులపై కఠిన చర్యలు క్షణాల్లో తీసుకుని వారు సభనుంచి పోకపోతే మార్షల్స్ ను పెట్టి మరీ బయటకు ఈడ్చేస్తున్నారు. ఇంకా ఉత్సాహం వుంటే సభ్యత్వాలు సైతం రద్దు చేసే స్థాయికి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతో అత్యున్నతమైన పదవిలో వుంటూ దేశ చట్టసభల్లో సభ్యులంతా ఎంతో గౌరవం ఇచ్చే వారు ఒక స్కూల్ టీచర్ చేసే పని కూడా చేయలేక పోతున్నారు.

అవిశ్వాసం సీన్ తీసుకుంటే …

మొన్న ముగిసిన లోక్ సభ సీన్ అత్యంత ప్రహసనంగా మారింది. వెల్ లోకి వచ్చి అల్లరి చేసే సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత సభను ఆర్డర్ లో పెట్టాలి. కానీ చిత్రంగా రోజు ఆందోళన చేసే వారు చేయడం సభను రెండు సార్లు వాయిదా వేసి తరువాత రోజు ఇదే సీన్ రిపీట్ చేయడం దేశ వాసుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఎపిసోడ్ లో అధికారపక్షానికి అవిశ్వాసం ఎదుర్కునే బలం ఉన్నప్పటికీ చర్చ జరగడం ఇష్టం లేక రోజు ఒకే తంతు నడిపిస్తూ చివరి రోజు సభను నిరవధిక వాయిదా వేసి అధికారపార్టీ ఉద్దేశ్యం చాటి చెప్పారు. ఇలా దేశ అత్యున్నత సభ సాగడం రాబోయే రోజుల్లో అధికారపార్టీలో వుండే వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా కొనసాగింది.

యుపిఎ అంతే …

గత యుపిఎ హయాంలో ఎపి పునర్విభజన బిల్లు అంశంలోనూ ఇదే తప్పు నాటి అధికారపార్టీ నిర్లజ్జగా చేసింది. ఇక విభజన చట్టం కోసం పార్లమెంట్ లో మరీ దారుణాలు చోటు చేసుకున్నాయి. సమగ్రంగా చర్చ జరగాలిసిన బిల్లుపై అత్యంత ఘోరంగా ప్రతిపక్షాలు ఏకమై ఎంతటి నిరసనలు వ్యక్తమైనా నిమిషంలో ఆమోదించం పొమ్మన్నాయి. ఇలా ప్రజాస్వామ్య దేవాలయంలో సాగుతున్న తతంగాలు మొత్తం వ్యవస్థకే కొత్త చీడ తెచ్చి పెడుతున్నాయి. మొగుడిని కొట్టి మొగసాల ఎక్కిన చందంగా చట్ట సభను సజావుగా నడిపించలేని ప్రభుత్వాలే తమ తప్పులను వదిలి విపక్షాలపై బ్లేమ్ గేమ్ ఆడటం అత్యంత విచారకరం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*