మళ్లీ మోడీ చూపు… ప్రశాంత్ వైపు..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019లో మళ్లీ కీలకం కానున్నారా..? ఆయన బీజేపీ తరుపున ఈసారీ రంగంలోకి దిగుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ ది కూడా కొంత పాత్ర ఉందనేది తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి వ్యూహకర్తగా ఆయన పనిచేశారు. అయితే, కారణమేదైనా బీజేపీ అధికారంలోకి రావడంతో కొంత క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ కి కూడా దక్కింది. దీంతో ఆయనకు డిమాండ్ కూడా పెరిగింది. 2015లో జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆయన నితీశ్ కుమార్ వైపు పనిచేయగా ఆయన కూడా అధికారంలోకి వచ్చారు.

మళ్లీ ప్రశాంత్ కిషోర్ పై మోడీ చూపు

గత ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయగా విజయం సాధించింది. అయితే, ఉత్తరప్రదేశ్ లో మాత్రం ప్రశాంత్ స్ట్రాటజీలు దారుణంగా విఫలమయ్యాయి. ఆయన పనిచేసిన కాంగ్రెస్-ఎస్పీ కూటమి ఓటమిని మూటగట్టుకుంది. మొత్తానికి చూస్తే ప్రశాంత్ కిషోర్ కి సక్సెస్ రేటు బాగానే ఉంది. అయితే, గత ఎన్నికలప్పుడు బీజేపీ వైపు ఉన్నా ఆయన తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ తో పనిచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారని తెలిస్తోంది. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ పెరగడంలో ప్రశాంత్ వ్యూహాలు కొంత ఉపయోగపడ్డాయనే సాఫ్ట్ కార్నర్ మోడీకి ఉంది. దీంతో మళ్లీ ప్రశాంత్ ను తమతో పనిచేయించుకోవాలని ఆయన పార్టీ అధ్యక్షులు అమిత్ షాకు సూచించారు. దీంతో ఇటీవల ఆయన బీజేపీ అగ్రనేతలతోనూ సమావేశమయ్యారు.

పెద్ద బాధ్యతలే పెడుతున్నారా..?

ఒకదఫా చర్చలు కూడా ప్రశాంత్ కిషోర్, బీజేపీ అగ్రనేతల మధ్య పూర్తయ్యాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ ప్రచార బాధ్యతలు ప్రశాంత్ కిషోర్ పై పెట్టకుండా, కేవలం భారతీయ జనతా పార్టీ దళితులకు అనుకూలంగా దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఏర్పరిచే బాధ్యతలు ప్రశాంత్ కిషోర్ పై పెట్టనున్నారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ స్ట్రాటజీలు బీజేపీ కి ఉపయోగపడినా ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చెప్పలేం. అదీ దళితులకు బీజేపీ వ్యతిరేకమనే బలమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ పై పెట్టే ఈ బాధ్యతలు ఏమేరకు నెరవేరుస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*