మోదుగుల తన దారి చూసుకుంటున్నారా…?

ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. అంతేకాదు, సీరియ‌స్ నాయ‌కుడు కూడా. ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌నే త‌ప‌న ఆయ‌న సొంతం. అంత‌కు మించి ఆయ‌న‌కు రాజ‌కీయాల‌పై మ‌క్కువ ఎక్కువ‌. పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావుపేట నుంచి విజ‌యం సాధించారు. త‌న‌దైన శైలిలో ఏపీ విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా కూడా గ‌ళం వినిపించారు. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మోదుగుల‌కు 2014లో గుంటూరు వెస్ట్ సీటును కేటాయించారు. అయితే, ఆయ‌న అప్ప‌టి టికెట్ కేటాయింపుపై కినుక వ‌హించారు. త‌న‌కు పార్ల‌మెంటుకు వెళ్లాల‌ని ఉంద‌ని, కానీ, అసెంబ్లీ టికెట్ ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే, మోదుగుల‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న హ‌వాను గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. ఆయ‌న‌కు వ‌ద్ద‌న్నా కూడా ప‌శ్చిమ గుంటూరు టికెట్‌ను ఇచ్చారు.

బలవంతంగా పంపి…..

ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి న‌ర‌సారావుపేట ఎంపీగా మోదుగుల‌కు స్వ‌యానా బావ అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆళ్ల‌పై మోదుగుల‌ను పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని చంద్ర‌బాబు ఆయ‌న‌కు బ‌దులుగా అప్పుడే పార్టీ మారిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావును అక్క‌డ రంగంలోకి దింపి మోదుగుల‌ను బ‌ల‌వంతంగా గుంటూరు వెస్ట్‌కు పంపారు. చివ‌ర్లో త‌న‌కు సంబంధం లేని గుంటూరు వెస్ట్‌కు మోదుగుల మారినా అక్క‌డ టీడీపీ కేడ‌ర్ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో పాటు గుంటూరు జిల్లాలో బ‌లంగా టీడీపీ వేవ్ ఉండ‌డంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. క‌ట్ చేస్తే.. నాలుగున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌యిం ది. అయితే, మోదుగుల ఇక్క‌డ ఎవ‌రితోనూ క‌ల‌వ‌లేక‌పోతున్నార‌నే అప‌ప్ర‌ద తెర‌మీద‌కి వ‌చ్చింది.

ప్రాధాన్యత ఏదీ….?

అంతేకాదు, పార్టీని ఆయన విమ‌ర్శిస్తున్నార‌నే అప‌వాదుకూడా రాజ్య‌మేలుతోంది. ప్ర‌భుత్వంలో త‌న‌కు ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంతోనే మోదుగుల కినుక వ‌హించారు. మంత్రి వ‌ర్గంలో ఆయ‌న సీటును ఆశించారు. అయితే, ఓసీ కాండెట్ల‌కు ఇప్ప‌టికే మంత్ర వ‌ర్గంలో ఎక్కువ‌గానే సీట్లు కేటాయించిన నేప‌థ్యంలో మోదుగుల‌కు చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించ‌లేదు. రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో మంత్రి ప‌ద‌వులు అన్ని పార్టీ మారిన వారికే ఎక్కువుగా చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్టేశారు. దీనికితోడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో మోదుగుల‌కు వ్యాపార లావాదేవీలు కూడా ఉండడం గ‌మ‌నార్హం. ఏతావాతా.. మోదుగుల‌కు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న ఒకింత అస‌హ‌నంతోనే ఉన్నారు. అయితే, మ‌రో వాద‌న ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తోంది.

క్యాడర్ సహకరించక…..

టీడీపీ నాయ‌కులే మోదుగుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం లేద‌ని, ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు కూడా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని కొంద‌రు మోదుగుల సానుభూతి ప‌రులు చెబుతున్నారు. మోదుగుల ఓకే.. కానీ, ఆయ‌న కు స‌హ‌క‌రించేందుకే టీడీపీ కేడ‌ర్ అస‌హ‌నంతో ఉంద‌ని, అందుకే ఆయ‌న ఇక్క‌డ ఏ ప‌నీ చేయ‌లేక‌పోతున్నార‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మోదుగుల ఇక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను పెద్దగా చేప‌ట్ట‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి త‌న‌కు న‌ర‌స‌రావుపేట ఎంపీ టికెట్ కేటాయించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. లేదంటే త‌న దారి తాను చూసుకుంటాన‌ని త‌ర‌చుగా చెబుతుండ‌డం కూడా గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారినా ఆశ్య‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని కూడా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మోదుగుల రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*