మోదుగుల సీటు మాయమేనా….?

ప్ర‌స్తుతం అధికార పార్టీ టీడీపీలో వార‌సుల రాజ‌కీయాల హ‌వా పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లెక్క‌కు మిక్కిలిగా వార‌సులు రంగ ప్ర‌వేశం చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి అదే పార్టీలో ఉన్న నాయ‌కులు త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపుతున్నారు. ఇక‌, వీరికి తోడు ప్ర‌స్తుతం మంచి హ‌వాలో ఉన్న నాయ‌కులు కూడా తమ కుమారుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌స్తున్నారు. దీంతో అధికార పార్టీ రాజ‌కీయాల్లో నేత‌ల వార‌సులు అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌ధానంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో వార‌సుల హంగామా ఎక్కువ‌గా ఉంది. గుంటూరులోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ వ‌రుస గెలుపుతో విజ‌యం సాధిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వార‌సులు రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.

పోటీకి సిద్ధమవుతున్న……

ఇక‌, నేత‌ల వారీగా చూస్తే.. గుంటూరు రాజ‌కీయాల్లో త‌ల‌పండిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు దాదాపు 40 ఏళ్లుగా రాజ‌కీయా ల్లోనే ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న అత్యంత సీనియ‌ర్ల జాబితాలో ఈయ‌న‌పేరు ముందు ఉంటుంది. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి న‌ర‌సారావుపేట ఎంపీగా ఉన్న ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడు రాయ‌పాటి రంగారావును ఇప్ప‌టికే రంగంలోకి దింపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ నుంచి త‌ప్పుకోవ‌చ్చ‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. దీంతో రంగారావు అరంగేట్రం దాదాపు ఖాయ‌మైంది. ఇక‌, ఇదే జిల్లాకు చెందిన మ‌రో కీల‌క రాజ‌కీయ దిగ్గ‌జం.. ప్ర‌స్తుతం అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు కోడెల శివ‌రామ‌కృష్ణ ఉర‌ఫ్ శివ‌రాం.. కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇద్దరికీ టిక్కెట్ దక్కాలని…..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు, త‌న కుమారుడికి కూడా టికెట్ ఇప్పించుకోవాల‌ని కోడెల భావిస్తున్నారు. ఒక‌వేళ ఇద్ద‌రికీ కుద‌ర‌ని ప‌క్షంలో త‌న కుమారుడికి త‌ప్ప‌కుండా టికెట్ వ‌చ్చేలా చూసుకోవాల‌ని కూడా ఆయ‌న ప్లాన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, పెద‌కూర‌పాడులో కాంగ్రెస్‌ రాజ‌కీయ దిగ్గ‌జాల‌ను మ‌ట్టిక‌రిపిం చి టీడీపీ జెండా ఎగుర‌వేసిన ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీథ‌ర్ త‌న‌యుడు కొమ్మాల‌పాటి సాయి సుధాక‌ర్ పేరు కూడా విన‌ప‌డుతోంది. సాయి సుధాక‌ర్ ఎవ‌రో కాదు టీడీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు అల్లుడు.

పశ్చిమ నియోజకవర్గంపైనే…..

వినుకొండ‌లో జీవీ వ‌రుస గెలుపుతో అంటే 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న హ‌వా సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న అల్లుడిని కూడా రాజ‌కీయాల్లో ఎమ్మెల్యేని చేయాల‌ని ఆయ‌న చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. సాయి సుధాక‌ర్‌కు ఉన్న ప్ల‌స్ ఏంటంటే ఇటు మామ‌, అటు తండ్రి ఇద్ద‌రూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే, విచిత్రంగా ఈ ముగ్గురు వార‌సులు ఒకే సీటు చుట్టూ తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. గుంటూరులోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఈ నాయ‌కులు తమ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. ఎవ‌రికి మ‌న‌సులో ఎలా ఆప్ష‌న్లు ఉన్నా వీరు గుంటూరు వెస్ట్‌పై కూడా క‌న్నేశారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున మోదుగుల వేణుగోపాల రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న వేరే నియోజ‌క‌వ‌ర్గాన్ని కోరుకుంటుండ‌డంతో నాయ‌కుల దృష్టి, వారి వార‌సుల చూపు ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనే ప‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి టికెట్ ఎవ‌రికి ల‌భిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*